RTC-Metro Combo Pass: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో మెట్రో రైలు, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలను భారీగా తగ్గించింది. ఇది ప్రయాణికులకు ప్రభుత్వ దీపావళి కానుక అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుక్రవారం ప్రకటించారు.

రోజువారీ పాస్‌ ధర రూ.400 నుంచి రూ.275కు, నెలవారీ పాస్‌ ధర రూ.8,500 నుంచి రూ.4,000కు తగ్గించారు. ఈ తగ్గింపు ధరలు నవంబర్‌ 8 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.


పాస్‌ వినియోగంపై వివరాలు

రోజువారీ, నెలవారీ పాసులు తీసుకునే వారికి ఆర్టీసీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణం చేయవచ్చు. మెట్రో రైల్లో మాత్రం పరిమితి ఉంటుంది. రూ.275 డైలీ పాస్‌తో ఒక రోజులో నాలుగు సింగిల్‌ జర్నీలు, రూ.4,000 నెలవారీ పాస్‌తో ఒక నెలలో గరిష్టంగా 50 సింగిల్‌ ట్రిప్పులు చేయవచ్చు. ఉమ్మడి పాస్‌ ధరల తగ్గింపుతో నెలవారీ పాస్‌ వినియోగదారులకు రూ.4,500 ఆదా అవుతుందని మంత్రి తెలిపారు.


బీసీ స్టడీ సర్కిల్‌ అభ్యర్థులకు స్టైపెండ్‌ పెంపు

ఇదే రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మరో ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు నవంబర్‌ నుంచి స్టైపెండ్‌ పెంచారు. సివిల్స్‌ ఉచిత కోచింగ్‌కు ఎంపికైన వారికి నెలవారీ స్టైపెండ్‌ రూ.5,000 నుంచి రూ.7,000కు, బుక్‌ ఫండ్‌ రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు. టీజీపీఎస్సీ, రైల్వే, ఐబీపీఎస్‌, పోలీసు, ఎస్‌ఎస్‌సీ వంటి పరీక్షలకు ఫౌండేషన్‌ కోర్సు చేస్తున్నవారికి స్టైపెండ్‌ రూ.1,000 నుంచి రూ.1,500కు పెంచారు.

సివిల్స్‌ సాధించాలంటే నిరంతర సాధన అవసరమని, గత రెండేళ్లలో శిక్షణ తీసుకుని సాధించలేకపోయిన వారికి కూడా స్టైపెండ్‌ ఇస్తూ ప్రవేశాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. యూపీఎస్సీ తరహాలో ప్రవేశ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని, బీసీ స్టడీ సర్కిల్‌ సంస్కరణల కమిటీ సిఫార్సుల్లో భాగంగా స్టైపెండ్‌ పెంచామని, మిగతా సిఫార్సులు త్వరలో అమలు చేస్తామని, సొంత భవనాల్లో స్టడీ రూమ్‌, డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Tags: