Damodara raja narasimha: ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై కఠిన చర్యలు – రిజిస్ట్రేషన్ రద్దుకు మంత్రి ఆదేశం
మంత్రి ఆదేశం
Damodara raja narasimha: రాష్ట్రంలో ఐవీఎఫ్ కేంద్రాల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, దోపిడీలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాల రిజిస్ట్రేషన్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కోఠిలోని టీజీఎంఎస్‌ఐడీసీలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలున్న అన్ని ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలను శాశ్వతంగా సీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడిన వైద్యులపై చర్యల విషయంలో రాష్ట్ర వైద్య మండలి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులతో సంప్రదింపులు జరిపి, వారి రిజిస్ట్రేషన్ల రద్దుకు సిఫారసు చేయాలి. సరోగసి, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) చట్టాల అమలును మరింత పటిష్ఠం చేయడంపై దృష్టి సారించాలి” అని మంత్రి అధికారులకు సూచించారు.
గతంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌లో జరిగిన అక్రమాలను ప్రభుత్వం అరికట్టిన విషయాన్ని కూడా మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ ముషారఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.