CM Revanth Reddy’s sensational comments: ‘పెన్నే కదా’ అని మన్ను కప్పినా.. గన్‌గా మారి గడీలు కూల్చింది: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
గన్‌గా మారి గడీలు కూల్చింది: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
CM Revanth Reddy’s sensational comments: తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన అందెశ్రీ సంతాప సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉద్యమానికి కవులు, కళాకారులు ఇచ్చిన ఊపుతోనే తెలంగాణ సాకారమైందని ఆయన గుర్తు చేశారు.
‘‘ఎన్నడూ బడికి వెళ్లని అందెశ్రీ అద్భుతమైన ‘జయజయహే తెలంగాణ’ పాట రాశారు. ఆ పాట లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక్క సభ కూడా జరగలేదు. కానీ, తెలంగాణ సాకారమైన తర్వాత ఆ పాట మూగబోయింది. పాలకుల దృష్టిలో పదేళ్లు మూగబోయి ఉండొచ్చు కానీ.. తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై నిలిచింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని కనుమరుగు చేసే ప్రయత్నాలు జరిగాయి’’ అని సీఎం ఆక్షేపించారు.
"కవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే.. అవి గన్నులై మొలకెత్తుతాయి.. మీ గడీలను కుప్పకూలుస్తాయని" అనే నినాదాన్ని అందెశ్రీ నిజం చేశారని చెప్పారు. ప్రజలు కోరుకున్న ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా ప్రకటించడమే కాకుండా.. ప్రతి బడిలో పాడాలి, పాఠ్యపుస్తకాల్లో రాయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం ప్రకటించారు.
‘‘తెలంగాణ ప్రజలు ఎంత అమాయకంగా కనిపిస్తారో.. అంత చైతన్యవంతులు. ఈ గడ్డ మీద ప్రజలు అహంకారాన్ని, అధిపత్యాన్ని సహించలేరు. ఎన్ని వజ్రాలు ఉన్నా.. కోహినూరు వజ్రం ప్రత్యేకం. అలాగే ఎందరు కవులు ఉన్నా.. డా.అందెశ్రీ ప్రత్యేకం’’ అని రేవంత్‌రెడ్డి స్పందించారు.
కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఆచార్య కోదండరాం, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పలువురు కవులు, గాయకులు అందెశ్రీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతాపం తెలిపారు. సభ వాతావరణం సంతాపాత్మకంగా, ఉద్యమ స్మృతులతో నిండినదిగా ఉంది.