ఇకపై నేనంటే ఏంటో చూపిస్తా - జన్మదిన వేడుకల్లో బాలకృష్ణ

From now on, I will show what I am - Balakrishna at his birthday celebrations;

Update: 2025-06-10 10:26 GMT

టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో జరిగాయి. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ పలు అంశాలు వెల్లడించారు. అయితే, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

తనకు పొగరు అని చాలామంది అనుకుంటారు. అవును.. నిజంగానే నాకు పొగరు, అహంకారం. నన్ను చూసుకుంటే, నా క్రమశిక్షణ, నా అంకితభావం చూసుకుంటే నాకే పొగరుగా అనిపిస్తుంది. అందులో తప్పేముందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు బాలకృష్ణ. అంతేకాదు. ఇకపై తానేంటో చూపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగం అందరినీ ఆశ్చర్యపరిచింది. బిరుదులు వస్తుంటాయని, పోతుంటాయని, వాటికి తాను అలంకారమే తప్ప అవి తనకు అలంకారం కాదని, మన పని మనం నిజాయతీగా చేసుకుంటూ పోవడమే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఏడాది తాను జన్మదినోత్సవం జరుపుకుంటాను. అయితే, ఈసారి మాత్రం ప్రత్యేకతలున్నాయని, నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవటం.. పద్మభూషణ్ అవార్డ్ తనకు రావటం ప్రత్యేకమన్నారు. వరుసగా తాను చేసిన నాలుగు సినిమాలు హిట్స్ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. మనిషికి పట్టుదల, క్రమశిక్షణ ఉండాలని, అఖండ -2 సినిమా షూటింగ్‌ కోసం జార్జియాలో మైనస్ 4 డిగ్రీల వాతావరణంలో స్లీవ్ లెస్ షర్ట్‌తో నటించానని.. నటుడిగా అది తన బాధ్యత అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశీస్సులు, అభిమానుల అండదండలతో 64 వసంతాలు పూర్తిచేసుకున్నానని, వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే అన్న బాలకృష్ణ... దాని గురించి తాను పెద్దగా పట్టించుకోనన్నారు.

ఈ సందర్భంగా బసవతారకం ఆసుపత్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, 15 ఏళ్ల క్రితం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆసుపత్రి అభివృద్ధికి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని పేదలకు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆశయం మేరకు, ఒకప్పుడు తాను కూడా మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్ష రాశానని, అయితే విధి మరోలా తలచి సినిమాల్లోకి వచ్చానని, కానీ సినిమాల్లో డాక్టర్ పాత్రలు పోషించడం ద్వారా ఆ కోరిక తీర్చుకున్నానని సరదాగా వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News