Minister Tummala Nageswara Rao: రైతులకు శుభవార్త.. రేపు (నవంబర్ 19) నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రేపు (నవంబర్ 19) నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Update: 2025-11-18 15:33 GMT

Minister Tummala Nageswara Rao: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు శుభవార్త చెప్పారు. నవంబర్ 19 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఆయన ప్రకటించారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు, పత్తి రైతుల ఇబ్బందులపై సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో, జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్‌తో జరిగిన చర్చలు సఫలమయ్యాయని మంత్రి తెలిపారు. యదావిథిగా కొనుగోళ్లు జరిగి, త్వరలోనే అన్ని జిల్లాల్లో జిన్నింగ్ మిల్లులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.

ప్రతిపక్ష నాయకుల ఉచ్చుల్లో రైతులు పడకుండా ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం తరపున జిన్నింగ్ మిల్లర్లకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. “నవంబర్ 19 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. రైతులు ఎవరి మాటల్లోనూ పడకుండా ఉండాలి. మేము అందరికీ సహకారం అందిస్తాం” అని మంత్రి తుమ్మల చెప్పారు.

పత్తి కొనుగోళ్లలో సీసీఐ అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 17 నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ విధానం, ఎకరానికి కేవలం ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం, కొనుగోలు కేంద్రాలను దశలవారీగా తెరవడం వల్ల రైతులతో పాటు మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ సమస్యలపై నవంబర్ 17న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల, జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడారు. సీసీఐ కొనుగోళ్లకు కేంద్రం విధించిన తేమ నిబంధనలను సడలించాలి, ఎకరానికి 7 క్వింటాళ్ల షరతును వదులుకోవాలని కోరారు. ఈరోజు మరోసారి సీసీఐ సభ్యులతో చర్చలు జరిపిన మంత్రి తుమ్మల, ఈ సమస్యలకు త్వరలో పరిష్కారం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఈ వర్షాకాల సీజన్‌లో 45.85 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు జరిగింది. 27 లక్షల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే, ఇప్పటివరకు సీసీఐ 67 వేల మంది రైతుల నుంచి 1.18 లక్షల టన్నుల పత్తి మాత్రమే కొనుగోలు చేసింది. ఈ ప్రకటన రైతుల్లో సంతోషాన్ని మేల్కొల్పింది.

Tags:    

Similar News