HYDRA Safeguards Government Land: మియాపూర్‌లో అక్రమార్కుల నుంచి రూ.3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
రూ.3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
HYDRA Safeguards Government Land: రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్‌లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) భారీ ఆపరేషన్ చేపట్టింది. దీంతో రూ.3 వేల కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమ కబ్జాదారుల చేతుల నుంచి విజయవంతంగా విడిపించింది.
మక్తా మహబూబ్ పేటలోని సర్వే నెంబరు 44లో 43 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు కొందరు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సర్వే నెంబరు 159కు చెందిన భూమి పత్రాలను ఉపయోగించి సర్వే నెంబరు 44లోని ప్రభుత్వ భూమిలో ఇప్పటికే ఒకటిన్నర ఎకరాల వరకు ఇమ్రాన్ అనే వ్యక్తి కబ్జా చేసినట్లు తేలింది. అతనిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు.
అలాగే మరో 5 ఎకరాల భూమిని కూడా అక్రమ ఆక్రమణల నుంచి హైడ్రా విడిపించింది. మొత్తంగా 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా చుట్టూ పక్కాగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అవసరమైన బోర్డులు కూడా పెట్టారు.
ఇక మియాపూర్ - బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై 200 మీటర్ల మేర మట్టి పోసి నిర్మించిన 18 షట్టర్లను కూడా హైడ్రా అధికారులు తొలగించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు పత్రాలపై సమగ్రంగా దృష్టి సారించిన హైడ్రా బృందం, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు తమ నిబద్ధతను మరోసారి చాటుకుంది.
ఈ ఆపరేషన్‌తో మియాపూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూములపై ఆక్రమణలు చేసే వారికి బలమైన సంకేతం లభించింది. హైడ్రా చర్యలు నగరవ్యాప్తంగా కొనసాగుతున్నాయి.