నేను సౌమ్యుడ్నే కానీ యుద్దంలోకి దిగితే యోధుడిని
తెలంగాణ బీజేపీ నూతన సారధి ఎన్.రామచంద్రరావు;
కార్యకర్తలే భారతీయ జనతా పార్టీకి నిజమైన సారధులని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అన్నారు. మంగళవారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత రామచంద్రరావు మాట్లాడుతూ నేను పేరుకే అధ్యక్షుడ్నని నేనెప్పటికీ కార్యకర్తనే మీ సేవకుడినే అని చెప్పారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఘ్ పోటీ చేస్తే అభ్యర్ధికి వెయ్యి ఓట్లు మాత్రమే వచ్చాయని కమ్యూనిస్టు అభ్యర్ధి గెలుపొందారని, అయినా జనసంఘ్ కార్యాలయంలో కార్యకర్తలు టపాసులు కాలిస్తే ఇదేంటని కమ్యూనిస్టులు ప్రశ్నించారని, గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని సంబరాలు చేసుకుంటున్నామని కార్యకర్తలు చెప్పారని రామచంద్రరావు తెలిపారు. అదే ఉత్సహంతో ఈ రోజు తెలంగాణలో 8మంది ఎంపీలు, 8మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను గెలిపించుకున్నామని రామచంద్రరావు అన్నారు. బీజేపీ ఈ స్ధాయికి వచ్చిందంటే ఎంతో మంది కార్యకర్తల, నాయకుల త్యాగాలు ఉన్నాయని అన్నారు. అందరి ఆశీస్సులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీజేపీ మాస్ క్యాడర్ ఉన్న పార్టీ, సిద్దాంత బలమున్న పార్టీ, కలసికట్టుగా గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దామని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. బీజేపీలో కొత్తా, పాత అనే పంచాయితీ లేదని నది ప్రవహించాలంటే కొత్త నీరు రావాల్సిందే అన్నారు. తెలంగాణ యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని, పంచాయితీ నుంచి పార్లమెంటు వరకూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని రామచంద్రరావు బీజేపీ శ్రేణులకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వాట్సాప్ వర్శిటీలను పెట్టుకుని ఫేక్ న్యూస్ ను ట్రోలింగ్ చేస్తున్నాయని మండిపడ్డారు. మీకు దమ్ముంటే నేరుగా పోరాడమని ఆ రెండు పార్టీలకు హితవు పలికారు. నేను క్రిమినల్ లాయర్‌నని ఫేక్ న్యూస్ సూత్రధారులను బోనులో నిలబెట్టేందుకు వెనుకాడనని రామచంద్రరావు హెచ్చరించారు. రామచంద్రరావు సౌమ్యుడని అనుకవద్దని ఏబీవీపీలో ఉన్నప్పుడే పోలీసు లాఠీ దెబ్బలు తిన్నోడినని, జైలుకు వెళ్లొచ్చానని తెలిపారు. కాళ్ళూ చేతులూ విరగ్గొట్టుకున్నా సిద్దాంతాన్ని విడవకుండా పనిచేసానని చెప్పారు. నేను సౌమ్యుడినే కానీ యుద్దంలో దిగితే యోధుడినే అని కత్తి దూయడంలో ముందుంటానని రామచంద్రరావు కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రసంగించారు. కలసికట్టుగా అందరితో కలసి పనిచేసి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు.