CM Revanth Reddy: పెట్టుబడులకు పూర్తి భరోసా నాదే.. ఎలాంటి సందేహాలూ వద్దు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు రావచ్చని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టే ప్రతి పెట్టుబడికీ తాను వ్యక్తిగతంగా సంరక్షకుడిగా ఉంటానని, పూర్తి భద్రత, వృద్ధి కల్పిస్తానని భరోసా ఇచ్చారు.
డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’కు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు గురువారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో సీఎం కీలకోపన్యాసం చేశారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌తోపాటు ఎంపీలు, సీఐఐ ప్రతినిధులు, వివిధ దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ “నేను ఇక్కడికి వచ్చింది మీ మాటలను వినడానికి. వ్యాపారం గురించి నాకంటే మీకే బాగా తెలుసు. మీ మాటలు విని, అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. తెలంగాణలో మీ పెట్టుబడులు పూర్తి సురక్షితంగా ఉంటాయి... వృద్ధి చెందుతాయి. రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు నేను సంరక్షకుడిగా ఉంటా. అందువల్ల ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. మీ మనసులో ఉన్న సంఖ్య నాకు కానీ, ఇంకొకరికి కానీ చెప్పొద్దు. ఆ సంఖ్యను మీ మనసులోనే ఉంచుకోండి. దాన్ని రెట్టింపు చేయండి. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలను తీసుకెళ్లండి. మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారో చెబితే చాలు. విధానపరమైన మద్దతు కోరుకుంటుంటే దానికి నేను వ్యక్తిగతంగా గ్యారంటీ ఇస్తా” అని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్రాల్లో భిన్న పార్టీల ప్రభుత్వాలు ఉన్నందున పెట్టుబడిదారులకు సంకోచం అవసరం లేదని సీఎం అన్నారు. “తాము కేంద్రంతో పూర్తి సఖ్యతతో పనిచేస్తున్నాం. ఈరోజు మా కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్‌గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొనడాన్ని బట్టి ఇక్కడ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలను ఊహించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్రైల్ కారిడార్లు ప్రకటిస్తే అందులో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణె కారిడార్లు తెలంగాణకు దక్కాయి. వరంగల్, ఆదిలాబాద్‌లకు కొత్త ఎయిర్‌పోర్టులు మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర నిర్మాణానికి మద్దతు ఇస్తోంది. రీజినల్ రింగు రోడ్డు నుంచి మెట్రోరైల్ విస్తరణ వరకు, నేవీ లోఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ నుంచి చాలా పథకాల అమలు వరకు మేం కేంద్రం నుంచి పూర్తిస్థాయి మద్దతు అందుకుంటున్నాం. దేశాభివృద్ధి, ప్రజాసేవ విషయంలో రాజకీయాలకు తావులేదు. వృద్ధిని ప్రోత్సహించడంలో ప్రభుత్వాల జోక్యం తక్కువగా ఉండాలి. మీకు అడ్డుగావచ్చే స్పీడ్ బ్రేకర్లను తొలగించి వృద్ధికి ఊతమివ్వడమే నా పని” అని తెలిపారు.
‘తెలంగాణ రైజింగ్ 2047’ దృష్టితో 2034 నాటికి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చెప్పారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా సుమారు 5 శాతం ఉండగా, 2047 నాటికి 10 శాతానికి పెంచాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ 400 ఏళ్ల క్రితమే ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందిందని, ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో పోటీ పడుతోందని అన్నారు. నిజాం నెలకొల్పిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ వంటి ప్రపంచ దిగ్గజాలు తయారయ్యారని గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు తీసుకువచ్చిన సంస్కరణలే నేటి భారత ఆర్థిక వ్యవస్థ పునాదులని కూడా ప్రస్తావించారు.
పారిశ్రామికవేత్తలు మంచి ఆలోచనలు, ఉత్తమ విధాన సూచనలు అందించాలని, వాటిని ప్రభుత్వం పరిశీలించి అమలు చేస్తుందని సీఎం కోరారు. “పురోగమిస్తున్న తెలంగాణలో మీరూ చేరండి. అంతా కలిసి ముందుకు సాగితే చరిత్ర సృష్టించగలం” అని ఆహ్వానం పలికారు.