Miyapur’s 550 Acres: మియాపూర్ 550 ఎకరాలు ప్రభుత్వానివే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
సుప్రీంకోర్టు కీలక తీర్పు
Miyapur’s 550 Acres: హైదరాబాద్ మియాపూర్లోని సర్వే నంబరు 100, 101లలో ఉన్న 550.39 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 23 ఏళ్లుగా నడుస్తున్న భూ వివాదానికి శాశ్వతంగా తెరపడింది. ఈ భూమి విలువ రూ.25 వేల నుంచి 60 వేల కోట్ల వరకు ఉందని అంచనా.జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం గురువారం 44 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరించింది. బండారి రామచందర్ వర్సెస్ మైత్రి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కేసులో ప్రైవేటు వ్యక్తులు, సొసైటీలు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. 1912 సర్వేలో ఈ భూములు ప్రభుత్వ పోరంబోకుగా నమోదైనట్లు, ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కు లేదని తేల్చిచెప్పింది.నేపథ్యం
1995లో బండారి రామచందర్ తదితరులు 23 మంది ప్రైవేటు వ్యక్తులు ఈ భూమి తమదేనని చెప్పి ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిషన్) యాక్ట్-1982 కింద ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1997లో ఆ కోర్టు వారిని భూ ఆక్రమణదారులుగా తీర్పు ఇచ్చి, భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. 1998లో హైకోర్టులో అప్పీలు చేయగా, 2003 ఏప్రిల్ 16న హైకోర్టు కూడా అదే తీర్పును సమర్థించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని హుడా/హెచ్ఎండీఏకు అప్పగించింది. దీనికి వ్యతిరేకంగా ప్రైవేటు వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. 23 ఏళ్ల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం కింది కోర్టుల తీర్పులను సమర్థించింది.నిజాం కాలం నుంచి నేటి వరకు
1912 సర్వేలో ఈ భూమి ప్రభుత్వ పోరంబోకుగా నమోదైంది. తర్వాత జాగీరు సెటిల్మెంట్ కమిషన్ సిఫారసుతో నిజాం కాలంలో కొంతమంది వారసులకు జాగీరుగా ఇచ్చారు. 1949లో జాగీర్లు రద్దు కావడంతో భూములు ప్రభుత్వం వశమయ్యాయి. అయినా 1950ల్లో రెవెన్యూ రికార్డుల్లో మోసపూరితంగా కొందరి పేర్లు పట్టాదారులుగా నమోదు చేశారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తప్పుడు ఎంట్రీలు చేసి భూమిని కాజేయాలని ప్రయత్నించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ ఎంట్రీలు బోగస్, మోసపూరితమైనవని తేల్చింది. జాగీరు హక్కులు రద్దయిన తర్వాత ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి యాజమాన్యం లేదని స్పష్టం చేసింది.ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో ఈ తీర్పు వచ్చింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ కేసు పై ప్రత్యేక శ్రద్ధ చూపి, విలువైన ప్రభుత్వ భూముల రక్షణకు అధికారులను ఆదేశించినట్లు సమాచారం.ఈ తీర్పుతో మియాపూర్లోని ఈ విలువైన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రైలు డిపో కూడా ఈ ప్రాంతంలోనే ఉంది.