Komatireddy Rajagopalreddy : ప్రజల కోసం అవసరమైతే మళ్ళీ రాజీనామా చేస్తా
సంచలన వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి;
మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా సిద్దమని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. వేల కోట్లు దోచుకునే వాడికి పదవులు కావాలి కానీ నాకు పదవులు ముఖ్యం కాదని కోమటిరెడ్డి అన్నారు. ప్రజల కోసం మళ్ళీ రాజీనామాకు నేను రెడీ అని వెల్లడించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరకి తీసుకు వచ్చానని గుర్తు చేశారు. మంత్రి పదవి ఇస్తానంటేనే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరనని, కానీ జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి తనను పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో లేదా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పదవుల కోసం కాళ్ళు పట్టుకునే నైజం నాది కాదని, మంత్రి పదవి కావాలా మునుగోడు ప్రజలు కావాలా అంటే నేను మునుగోడు ప్రజలే కావాలని చెపుతానన్నారు. మునుగోడు అభివృద్ధి మాత్రం నాదే బాధ్యత అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మరోసారి కాంగ్రెస్ నాయకత్వంపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు.