Harish Rao : బనకచర్ల కట్టి తీరతామని మీరంటే అడ్డుకుని తీరతామని మేమంటాం
ఏపీ మంత్రి నారా లోకేష్ కి కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు;
కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకోవడానికి మీ తండ్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి ఏడు లేఖలు రాశారని, ఆ విషయం మీకు తెలియకపోతే మీ నాన్నను అడిగి తెలుసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు ఏపీ మంత్రి నారా లోకేష్ కి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును మేము అడ్డుకోలేదని, ఆంధ్రప్రదేశ్‌లో బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు శుక్రవారం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 రకాల అనుమతులు ఉన్నాయి, కావలంటే లోకేష్‌కు ఆ అనుమతులన్నీ పంపిస్తామన్నారు. అధికారంలో ఉన్నమని, మంద బలం ఉందని లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడటం పొరపాటని హరీష్ రావు అన్నారు. బనకచర్ల కట్టి తీరుతామని లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదని హరీష్ ఎత్తిచూపారు. సీయంతో సహా మంత్రులెవ్వరూ లోకేష్ వ్యాఖ్యలను ఖండించలేదన్నారు. కేంద్రప్రభుత్వం, రేవంత్‌రెడ్డిలను చూసుకుని లోకేష్ మాట్లాడుతున్నారన్నారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రేవంత్ రెడ్డి నోరు తెరవకపోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట పాడిందే పాటగా పరిస్ధితి తయారయ్యిందన్నారు. నిజంగా మిగులు జలాలు ఉంటే బనకచర్ల డీపీఆర్‌ను కేంద్ర సంస్ధలు ఎందుకు తిప్పి పంపాయని హరీష్ రావు ప్రశ్నించారు. మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోయకుండా ఏపీకి తీసుకు వెళ్లాలని చూస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. బనకచర్ల కట్టి తీరుతామని మీరంటే ఆపి తీరుతామని మేము అంటున్నామని హరీష్ రావు అన్నారు. సూటిగా లోకేష్‌ని అడుగుతున్నా మావాటా కింద 968 టీఎంసీలను అంగీకరించమని హరీష్ రావు అడిగారు. గోదావరిపై మేము నిర్మించే ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మీరు కేంద్రానికి రాసిన లేఖలను ఉపసంహరించుకోమని హరీష్ రావు ఏపీ మంత్రి నారా లోకేష్ ని డిమాండ్ చేశారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బిజేపీ ఎంపీలు ఉండి అడ్జర్న మెంట్ మోషన్ ఇచ్చి ఎందుకు బనకచర్ల మీద ఎందుకు నిలదీయడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. అవసరం అయితే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళి తెలంగాణ హక్కులు కాపాడుకుంటామని హరీష్ రావు స్పష్టం చేశారు.