ఎకరాకు రూ.4 కోట్లు ఇవ్వకపోతే కష్టం - భూసేకరణను అడ్డుకున్న రైతులు
It will be difficult if Rs. 4 crore per acre is not given - farmers who blocked land acquisition
సమస్య భూమి విలువపై కాదని, జీవనాధారంపై అని హన్మకొండ జిల్లాలోని రైతులు తేల్చిచెప్పారు. నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కోసం భూముల సేకరణలో భాగంగా, హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద భూ సేకరణు రైతులు అడ్డుకున్నారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఇక్కడున్న భూములకు ఉన్న విలువ ప్రకారం ఎకరాకు రూ.4 కోట్లు ఇవ్వకపోతే, ఒక్క అడుగు కూడా మేం వెనక్కి వెళ్లబోమని రైతులు ఘాటుగా హెచ్చరించారు. అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగగా, పోలీసుల బందోబస్తు మధ్య ఎక్స్‌కవేటర్‌ల పనులు కొనసాగాయి. పనులను అడ్డుకున్న కొంతమంది రైతులను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం వదిలేశారు. ఇది పచ్చని భూమి అని, యేడాదికి తమకు రెండు పంటలు పండుతుందని, తమ పిల్లల భవిష్యత్తు, జీవనాధారం అంతా ఈ భూములపైనే ఆధారపడిందని, కనీసం న్యాయమైన పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కోవడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే దేశాన్ని ఆకర్షించే మరో ప్రధాన ప్రాజెక్టుగా చేపట్టబోతున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ మొత్తం 405 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ మార్గం ₹14,000 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఆరు లేన్లకు విస్తరించనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో 306 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. అయితే భూపాలపల్లి జిల్లాలో ఎకరాకు రూ. 20-27 లక్షల పరిహారం మంజూరు చేసిన ఎన్‌హెచ్‌ఏఐ, హన్మకొండ జిల్లాలో మాత్రం భూములకు తక్కువ పరిహారం ఇవ్వడం రైతుల్లో అసంతృప్తికి కారణమయ్యింది. అయితే, తమకు న్యాయం జరగకపోతే.. న్యాయస్థానాలకైనా వెళ్తామని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.