Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: గెలిచి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

గెలిచి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Update: 2025-09-15 05:42 GMT

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తప్పక గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రులు, నియోజకవర్గ డివిజన్ ఇన్‌ఛార్జులు, ఇతర కీలక నేతలతో సమావేశమై ప్రచార వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి డివిజన్‌కు రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ ఛైర్మన్‌లను, నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు (పొన్నం, తుమ్మల, వివేక్)ను ఇన్‌ఛార్జులుగా నియమించినట్లు తెలిపారు. వీరంతా సమన్వయంతో క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించి, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే పర్యటించిన ఇన్‌ఛార్జుల నుంచి వివరాలు సేకరించి, ప్రచారంలో లోపాలుంటే సవరణలు చేయాలని చర్చించారు.

సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై దృష్టి

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చేయాలని సీఎం సూచించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచార ప్రణాళికలు సిద్ధం చేయాలని, నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించే భరోసా ప్రజలకు కల్పించాలని మంత్రులకు ఆదేశించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ విజయం కీలకమని, అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. “పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేయాలి. క్షేత్రస్థాయి పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తాను” అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అంకెలతో ప్రచారం చేయాలి: మహేశ్‌కుమార్ గౌడ్

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అంకెలతో సహా ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ గెలుపు నగరంలో మరిన్ని అభివృద్ధి పనులకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇన్‌ఛార్జులుగా నియమితులైన మంత్రులు తుమ్మల, పొన్నం, వివేక్‌లు కూడా ప్రచార వ్యూహాలపై సలహాలు ఇచ్చారు.

Tags:    

Similar News