Telangana High Court: తెలంగాణ హైకోర్టు: ఆరోపణలు, అనుమానాల ఆధారంగా పరీక్షలు రద్దు చేయడం సరికాదు
పరీక్షలు రద్దు చేయడం సరికాదు
గ్రూప్-1పై సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసిన ధర్మాసనం
పరీక్షల పవిత్రతకు ఊహాగానాలతో భంగం కలిగించలేం
Telangana High Court: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వంటి రాజ్యాంగబద్ధ సంస్థ నిర్వహించిన పరీక్షల పవిత్రతను కేవలం ఊహాగానాలు, నిరాధార ఆరోపణల ఆధారంగా అనుమానించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మాస్ కాపీయింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి తీవ్ర అవకతవకలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లేకుండా పరీక్షలను రద్దు చేయడం సరికాదని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.
గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై సింగిల్ జడ్జి గత ఏడాది ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీతోపాటు అర్హత సాధించిన అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం 123 పేజీల తుది తీర్పును వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేసింది.
సింగిల్ జడ్జి తీర్పులో గత ఏడాది మార్చి 10న విడుదలైన తుది మార్కుల జాబితా, మార్చి 30న విడుదలైన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేయాలని, సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం మోడరేషన్ పద్ధతిలో మాన్యువల్ రీవాల్యుయేషన్ చేసి 563 పోస్టులను భర్తీ చేయాలని లేదా తాజా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధాన అంశాలు ఇలా...
అనుమానాలు మాత్రమే, ఆధారాలు లేవు: ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు జారీ చేయడం అనుమానాస్పదమని సింగిల్ జడ్జి పేర్కొన్నప్పటికీ, నోటిఫికేషన్‌లో దీనిపై నిషేధం లేదు. రెండు హాల్‌టికెట్లతో పిటిషనర్లకు ఎలాంటి నష్టం జరిగిందో నిరూపణ కాలేదు. పరీక్షల పవిత్రత దెబ్బతిన్నట్లు ఆధారాలు లేవు.
పరీక్ష కేంద్రాల ఆరోపణలకు ఆధారాలు లేవు: కేంద్రాల పెంపు, కేటాయింపుల్లో దురుద్దేశం ఉందనే ఆరోపణలను పిటిషనర్లు నిరూపించలేకపోయారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా కేటాయింపు జరిగిందని, మహిళా అభ్యర్థులకు మరుగుదొడ్ల సౌకర్యం లేని కేంద్రాలను మహిళలకు కేటాయించారని కమిషన్ వివరించింది. రెండు కేంద్రాలు మహిళలకు మాత్రమే కేటాయించడం పక్షపాతం కాదు.
ఏకరీతి మూల్యాంకనం: బహుళ మూల్యాంకన విధానంలో బార్‌కోడ్ ఉండటం వల్ల అభ్యర్థుల గుర్తింపు సాధ్యం కాదని కమిషన్ వివరించింది. ఏ అభ్యర్థికీ ప్రత్యేక ప్రయోజనం చేకూరినట్లు నిర్దిష్ట ఉదాహరణలు లేవు. నిష్పక్షపాతంగా పరీక్ష నిర్వహణలో విఫలమైనట్లు నిరూపణ కాలేదు.
తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం ఊహాజనితమే: తెలుగు భాషలో ప్రావీణ్యం ఉన్న మూల్యాంకనదారులు ప్రత్యేకంగా లేకపోవడం వల్ల అన్యాయం జరిగిందనే ఆరోపణకు ఆధారాలు లేవు.
పారదర్శకత కోసమే బహుళ మూల్యాంకన విధానాన్ని అనుసరించామని, రెండు హాల్‌టికెట్ల జారీతో ఎలాంటి నష్టం లేదని హైకోర్టు గుర్తించింది. ఈ తీర్పుతో గ్రూప్-1 ఎంపికైన అభ్యర్థులకు పెద్ద ఊరట లభించింది.