Former MLC Kavitha: కవిత ఫైర్: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం లేదు.. బీసీలు ఆలోచించుకోవాలి!
బీసీలు ఆలోచించుకోవాలి!
Former MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీల అంశంలో బీఆర్ఎస్ ఎన్నడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయాలా.. వద్దా అనేది బీసీలే ఆలోచించుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో అంత యాక్టివ్‌గా లేదని, పార్టీ నేతలు కిందిస్థాయిలో క్రియాశీలంగా లేరని విమర్శించారు. "కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదు? ప్రచారం చేయడం లేదంటే వారు రాష్ట్రస్థాయి నేతలు కారా?" అని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ తన విధానాన్ని స్పష్టంగా చెప్పలేదని, ఆ సామాజిక వర్గానికి అనుకూలమా లేదా అనేది వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మాధవరెడ్డికి ఆ పార్టీ టికెట్ ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు. పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీని గాలికి వదిలేశారా? అని సందేహం వ్యక్తం చేశారు.
తమ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నామని, ఏర్పాటు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని కవిత తెలిపారు.
అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అన్నారు. "నేను అసంబద్ధంగా మాట్లాడితే ప్రజలే ప్రశ్నిస్తారు. ఎవరు సమాధానాలు దాటవేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్రను చెరిపేస్తే చెరిగిపోయేది కాదని, ఆయన సేవలను గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.