Kadiyam Srihari Meets Speaker: ఫిరాయింపు నోటీసులపై మరింత సమయం కోరుతూ.. స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి
స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి
Kadiyam Srihari Meets Speaker: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిశారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పందనగా వివరణ ఇవ్వడానికి మరికొంత గడువు కావాలని ఆయన స్పీకర్‌ను కోరినట్లు తెలుస్తోంది.
గతంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయిన సంగతి తెలిసిందే. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీలోపు అఫిడవిట్ రూపంలో సమాధానాలు సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ సమాధానాలను అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కానీ దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఇంకా స్పందన తెలపలేదు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి స్పీకర్‌ను నేరుగా కలిసి మరింత సమయం కోరినట్లు సమాచారం.
ఇదే విషయంపై దానం నాగేందర్ కూడా త్వరలో స్పీకర్‌ను కలవనున్నారు. ఆయన మరింత గడువు కోరతారా లేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం మరింత హీటెక్కింది.