Telangana Jagruthi President Kalvakuntla Kavitha Clarifies: కవిత: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తాం- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ
Telangana Jagruthi President Kalvakuntla Kavitha Clarifies: సామాజిక తెలంగాణను సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ రాజకీయ వేదిక తరఫున పోటీ చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పార్టీ పేరును ప్రజల సూచనల ఆధారంగా ఖరారు చేస్తామని పేర్కొన్నారు.
సోమవారం ఎక్స్ (ట్విట్టర్)లో నెటిజన్లు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తూ కవిత మాట్లాడారు. ‘‘తెలంగాణ సాధికారత కోసం నాణ్యమైన ఉచిత విద్య, వైద్య సేవలు ప్రజలకు అందేలా చూడాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మా ముఖ్య లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ప్రజల్లో ఆ పార్టీ పాలనపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఫార్మా సిటీ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటానికి మేం పూర్తి మద్దతు ఇస్తాం’’ అని కవిత తెలిపారు.
ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానిస్తూ ‘‘నేను చిరంజీవి గారి అభిమానిని. రాంచరణ్ ఎంతో వినయంగా ఉంటారు’’ అని చెప్పారు. రాజకీయాలు మానేసి బిజినెస్ చేయమంటూ మరో నెటిజన్ సూచన చేయగా... ‘‘సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎక్కువే. అలాంటివి పట్టించుకోకుండా సానుకూలంగా ఆలోచించాలి’’ అని కవిత సలహా ఇచ్చారు.
తెలంగాణ జాగృతిని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తామని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఆమె ఈ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి.