Komatireddy rajagopalreddy : రేవంత్‌రెడ్డికి పక్కలో బల్లెంలా తయారైన కోమటిరెడ్డి
సీయం వెనకాల 20 మంది ఆంధ్రా కాంట్రాక్టర్లు ఉన్నారని సంచలన ఆరోపణ;
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి సొంత పార్టీకే చెందిన శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రోజు రోజుకూ పక్కలో బల్లెంలా తయారవుతున్నారు. తరచు ముఖ్యమంత్రిపై సూటిగా విమర్శలు చేస్తూ రేవంత్‌రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు రాజగోపాల్‌రెడ్డి. సీయం ప్రసంగాలను, ఆయన హావభావాలను కూడా తప్పు పడుతూ మీడియా ముందు ఓపెన్‌గానే మాట్లాడుతూ సీయంకు చికాకులు తెప్పిస్తున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీయం రేవంత్‌రెడ్డి వెనకాల 20 మంది ఆంధ్రా కాంట్రాక్టర్లు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. మొన్నామధ్య జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కని నాటి నుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అవకాశం చిక్కినప్పుడల్లా ముఖ్యమంత్రిపై ఒంటికాలి మీద లేచిపోతున్నారు. బుధవారం రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు లేవదీశాయి. సీయం రేవంత్‌రెడ్డి వెనకాల 20 మంది ఆంధ్రా కాంట్రాక్టర్లు ఉండి తెలంగాణ సంపదను, భూములను, కాంట్రాక్టులను దోచుకుంటున్నారని, ఇకపై ఈ దోపిడీ వ్యవహారాన్ని ఉపేక్షించేది లేదని రాజగోపాల్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆయన మాట్లాడే భాష, హావభావాలు మార్చుకోవాలని సూచించారు. సోషల్ మీడియా జర్నలిస్టులపై దాడి చేయడం రేవంత్‌రెడ్డికి తగదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో సోషల్ మీడయా పాత్ర చాలా ఉందని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో కూడా సోషల్ మీడియా పాత్ర ఉందని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వారిపై సీయం రేవంత్‌రెడ్డి అవమానకరంగా మాట్లాడటం నన్ను బాధపెట్టిందని అందుకే రియాక్ట్ అయ్యాయని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. తాను సోషల్ మీడియా యాక్టివిస్టులకు అండగా ఉంటానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టిస్తున్నాయి.
రాజగోపాల్‌రెడ్డి సోదరుడు, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయంలో చేతులెత్తేశారు. మంత్రి పదవి వ్యవహారం అన్నదమ్ముల మధ్య విభేదాలకు దారితిసిందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు చెపుతున్నాయి. ఈ వ్యవహారంపై వెంకటరెడ్డి నిన్న ఢిల్లీ పర్యటనలో మీడియా వద్ద ప్రస్తావించారు. తాను కేవలం ఒక మంత్రిని అని నాతమ్ముడికి మంత్రి పదవి ఇప్పించే స్ధాయిలో లేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలన్న విషయం పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని ఆయన ఈ వ్యవహారం తనకు అంటకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని ఇటీవల సీయం రమేష్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తున్నారని తాము చేసిన ఆరోపణలకు బలం చేకూరిందని బీఆర్‌ఎస్ విమర్శలు మొదలు పెట్టింది. రాజగోపాల్‌రెడ్డి చెపుతున్న 20 మంది కాంట్రాక్టర్లలో సీయంరమేష్ కూడా ఒకరని బీఆర్‌ఎస్ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టేసింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు నేపథ్యంలో ఎవరు అరెస్ట్ అవుతారనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ ఆయుధంలా ఉపయోగించుకునే పరిస్ధితి కనిపిస్తోంది.