Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెంచుతూ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నానని బహిరంగంగా వెల్లడించిన ఆమె, సీఎం పదవి కేవలం అధికారం కాదని, ఆ పదవికి గౌరవం, హుందాతనం ఎంతో ముఖ్యమని అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై విమర్శలు గుప్పిస్తూ.. ఇకపై ‘తుగ్లక్ చర్యలు’ అని చెప్పాల్సిన అవసరం లేదని, ‘రేవంత్‌రెడ్డిలా ఉన్నావ్’ అంటే చాలని కవిత వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రంగా స్పందించారు.

“దమ్ముంటే హరీశ్‌రావు భార్య నాపై పోటీ చేయాలి” అని సవాల్ విసిరిన కవిత, తనపై ఎవరో ఒకరు పోటీ చేయడం తప్పదని అన్నారు. అవసరమని భావిస్తే హరీశ్‌రావు రాజకీయాలను పక్కనపెట్టి తన భార్యను రాజకీయాల్లోకి తీసుకురావచ్చని సూచించారు. గతంలో తాను హరీశ్‌రావుపై పోటీ చేస్తానని చెప్పిన మాట వాస్తవమేనని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆయన భార్య తనపై పోటీ చేస్తే స్వాగతిస్తానని స్పష్టం చేశారు. తనపై ఎవరు పోటీ చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ధీమా వ్యక్తం చేశారు.

కవిత ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

Tags: