CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని హకీంపేటలో మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్ నాయకులైన కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. కేటీఆర్ సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆమెను ఇంటి నుంచి గెంటేశారని ఆయన అన్నారు. ‘‘చెల్లి ఏదైనా తప్పు చేసినా క్షమించి అక్కున చేర్చుకునేవాడే అన్న. కానీ కేటీఆర్ మాత్రం జైలు నుంచి వచ్చిన చెల్లిని బయటకు పంపించేశారు’’ అని సీఎం విమర్శించారు.


మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ రేవంత్ ఇలా అన్నారు: ‘‘పిల్లల చదువు, ఎదుగుదలే మహిళల అసలైన అభ్యున్నతి. ప్రతి ప్రభుత్వ పథకంలో మహిళలనే భాగస్వాములుగా చేస్తాం. ఆడబిడ్డలకు భరోసా ఉండాలని ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరిటే ఇచ్చాం. బియ్యం, కరెంట్ బిల్లు, బస్సు ఛార్జీల రూపంలో గతంలో ఎంతో ఖర్చు చేసేవారు. ఆర్థికభారం తగ్గించాలని ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాం. మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తే.. ఆటో డ్రైవర్లతో బీఆర్‌ఎస్ నేతలు గొడవ చేయించారు. 70 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని పథకాలను తీసుకొచ్చా. వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులుగా చేశాం. హైటెక్ సిటీలో శిల్పారామం పక్కన ఇందిర మహిళా శక్తి స్టాళ్లు, క్యాంటీన్లు కేటాయించాం. కేసీఆర్, కేటీఆర్ పదేళ్లలో మహిళలకు ఏమిచ్చారో అడగండి.’’

నవంబర్ 19న కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు కూడా సీఎం ప్రకటించారు.

Tags: