KTR Press Meet: కేటీఆర్ ప్రెస్‌మీట్: ఫలితాలు నిరుత్సాహపరిచాయి.. ప్రతిపక్ష పాత్ర బలంగా పోషిస్తాం
ప్రతిపక్ష పాత్ర బలంగా పోషిస్తాం
KTR Press Meet: ‘రాజకీయాల్లో గెలుపు-ఓటములు సహజం. ముందుకు పోదాం, కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలి. మరింత బలంగా పనిచేద్దాం. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం వరకు శ్రమిద్దాం’ అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ అభ్యర్థి మాగంటి సునీతపై సుమారు 25 వేల ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నిక పార్టీకి కొత్త ఉత్సాహం, బలాన్ని ఇచ్చిందని, రాష్ట్రంలో నిజమైన ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ మాత్రమేనని ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. ఇకపై ప్రజా సమస్యలపై పోరాటం మరింత బలంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఎన్నికలో నిజాయితీగా పోరాడాం..
కేటీఆర్ మాట్లాడుతూ, "వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ, పార్టీ నాయకులు జూబ్లీహిల్స్ ఎన్నికలో విజయం కోసం నిర్విరామంగా పనిచేశారు. వారికి పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతి బూత్‌లో స్థానిక నాయకత్వం అద్భుతంగా పనిచేసింది. మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా, ఆమె కష్టపడి పోరాడారు. గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ అద్భుత పాత్ర పోషిస్తోంది. ప్రజా సమస్యలు కేంద్రంగా పోరాడుతున్నాం. మాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు ధన్యవాదాలు. ప్రజాక్షేత్రం, సోషల్ మీడియాలో మేము సమర్థవంతంగా పనిచేస్తున్నాం.
ఈ ఉపఎన్నికలో మేము నిజాయితీగా పోరాడాం. ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. వాటిపై నేను మాట్లాడను. ప్రచారం ముగిసే వరకు ఒక రకం.. ముగిసాక మరో రకంగా జరిగాయి" అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ గెలవలేదు.. మేము ఐదు సీట్లు గెలిచాం
"2014-23 మధ్య ఏడు ఉపఎన్నికలు జరిగాయి. అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క ఉపఎన్నికలోనూ గెలవలేదు. మేము ఐదు సీట్లు గెలిచాం, రెండింటిలో ఓడిపోయాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒకట్రెండు కార్పొరేటర్ సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రజల తరపున వాదనను బలంగా వినిపించాం. ప్రజా సమస్యలు, ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. కుల, మత రాజకీయాలు, అసభ్య పదజాలం ఉపయోగించలేదు. చాలా హుందాగా పోరాడాం. ప్రజలకు అవసరమైన పాయింట్లు మాత్రమే చర్చకు పెట్టాం. కాంగ్రెస్, భాజపా ఎన్ని రకాలుగా కవ్వించినా సంయమనం పాటించాం. పదేళ్లు ప్రభుత్వం నడిపిన ఒక జవాబుదారీ పార్టీగా జూబ్లీహిల్స్‌కు రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశాం" అని కేటీఆర్ వివరించారు.
చిన్న సెట్‌బ్యాక్ మాత్రమే.. పోరాటం కొనసాగుతుంది
"జాతీయ స్థాయిలో చూస్తే బిహార్‌లో కాంగ్రెస్ ఉనికి కోల్పోయే పరిస్థితి. ఈ ఎన్నిక బీఆర్‌ఎస్‌కు చిన్న సెట్‌బ్యాక్ మాత్రమే. ఫలితాలను సమీక్షించుకుంటాం, ఆత్మవిమర్శ చేసుకుంటాం. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా దీటుగా ఎదుర్కొని మంచి ఓటింగ్ సాధించాం. ఒక పార్టీ డిపాజిట్ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దొంగ ఓట్లపై స్పష్టమైన ఆధారాలు ఇచ్చాం. పోలింగ్ రోజు మా అభ్యర్థిని పట్టుకున్నారు. ఎన్నికల కమిషన్, పోలీసులు సమాధానం చెప్పాలి. ఓటమికి సాకులు వెతకడం లేదు, చర్చకు సిద్ధం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బెంగాల్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో పది చోట్ల ఉపఎన్నికలు రావాల్సిందే. ఒక్క ఉపఎన్నికకే కాంగ్రెస్ ఇన్ని ఆపసోపాలు పడింది. పది చోట్ల జరిగితే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను తీసుకుంటారేమో" అంటూ కేటీఆర్ ఎదుగుదల చూపారు.