హైదరాబాద్ కొత్త యుఎస్ కాన్సుల్ జనరల్‌గా లారా విలియమ్స్
యూస్ కాన్సులేట్ జనరల్‌గా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాని ప్రకటన;
హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ కొత్త కాన్సుల్ జనరల్‌గా లారా విలియమ్స్ బాధ్యతలు చేపట్టారు. యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విభాగంలో సీనియర్ సభ్యురాలైన లారా విలియమ్స్‌కు దౌత్య పరమైన వ్యవహారాలలో విశేష అనుభవం ఉంది. హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ గా పనిచేయడానికి తనకు అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు లారా విలియమ్స్ అన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలతో యూఎస్-ఇండియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని విలియమ్స్ తెలిపారు. అభివృద్ధి, ప్రజా శ్రేయస్సులను దృష్టిలో పెట్టుకుని సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న గొప్ప ప్రాంతంలో అమెరికా ప్రభుత్వం, ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి విలువలతో కూడిన ప్రాతినిధ్యం వహిస్తామన్నారు. లారా విలియమ్స్ గతంలో యుఎస్ డిపార్ట్‌మెంట్‌లో ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్ కోసం డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా పనిచేశారు.