TPCC Chief Mahesh Kumar Goud: చట్టం తన పని తాను చేసుకుంటోంది.. కేటీఆర్‌పై కక్ష సాధింపు కాదు: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
కేటీఆర్‌పై కక్ష సాధింపు కాదు: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
TPCC Chief Mahesh Kumar Goud: ఫార్ములా-ఈ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కె.టి. రామారావు)పై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. "కక్ష సాధింపు చర్యలైతే ఎప్పుడో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేవాళ్లం. సీఎం రేవంత్ రెడ్డికి ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవు" అని ఆయన కౌంటర్ ఇచ్చారు.
గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ గురువారం కేటీఆర్‌పై నేరారోపణకు అనుమతి ఇవ్వడంతో ఈ కేసు మరింత వేడెక్కింది. ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ ఏ-1 నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే నాలుగుసార్లు ఏసీబీ ముందు హాజరై ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయనపై త్వరలోనే చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. "పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలనే ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఇది ప్రజల తీర్పు. కక్షలు సాధించే ఉద్దేశం మాకు లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసుపై కూడా మహేష్ గౌడ్ లేవనెత్తారు. "కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు అవుతోంది. కానీ ఇప్పటివరకు విచారణ ఎందుకు ప్రారంభించలేదు? కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిపై సమాధానం చెప్పాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ నేతలు ఈ చర్యలను రాజకీయ కక్షలుగా చిత్రీకరిస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ నాయకత్వం చట్టబద్ధతనే నొక్కి చెబుతోంది. రాష్ట్రంలో అవినీతి కేసులపై రేవంత్ సర్కార్ దూకుడు కొనసాగిస్తుండటంతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది!