Heavy Rains in Telangana : భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం

మెదక్‌, కామారెడ్డి జిల్లాలు అతలాకుతలం… నీట మునిగిన వేలాది ఎకరాలు;

Update: 2025-08-28 04:08 GMT

గడచిన మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్‌, కామారెడ్డి జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా జిల్లా అంతటా వరద ముంచెత్తింది. వరదల కారణగా ఈ రెండు జిల్లాల్లో ప్రజా జీవనం స్తంభించిపోయింది. ప్రజలు వదరల్లో చిక్కుకుని అన్నపానియాలు లేక అల్లాడిపోయారు. వేలది ఎకరాలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్‌ పైపుల ద్వారా వరద నీరు మొదటి అంతస్తుల్లోకి ఉబికి వస్తోంది. చాలా ప్రాంతాల్లో ప్రజలు వరద నీటి మధ్య చిక్కుకుని పోయి హెలీకాఫ్టర్‌ సహాయం కోసం వేచి చూశారు. మెదక్‌ జిల్లా హవేలీఘనపూర్‌ మండలం ధూప్‌సింగ్‌ తాండాను వరద నీరు ముంచెత్తింది. ఇక్కడ ప్రజలు ఇళ్ళ ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. వాగులు వంకలు, చెరువులు కట్టలు తెగి వరద నీరు ఉప్పొంగి గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. వరద ఉధృతికి ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుని పోయాయి. హవేలీఘనపూర్‌ మండలం నాగపూర్‌ వాగులో వరద ధాటికి కారు కొట్టుకు పోయింది. ఈ కారులో నలుగు ప్రయాణికులు ఉన్నట్లు చెపుతున్నారు. భారీ వర్షాలకు ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ మానేరులో ఒక వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. గేదెలను మేపడానికి వాగు అవతలవైపునకు వెళ్లిన రైతులు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. మెదక్‌ జిల్లాలో ఒక సంక్షేమ హాస్టల్లో 400 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారంతా ప్రణభయంతో హాస్టల్‌ భవనం పైకి ఎక్కి తల దాచుకున్నారు. ఫైర్‌ బోట్ల ద్వారా తొలుత 150 మంది విద్యార్థులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్థానికుల సహాయంతో అగ్నిమాపక శాఖ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి మిగిలిన విద్యార్థులను కూడా వరద నీటి నుంచి బయటకు తీసుకువచ్చారు. అలాగే నిజాంపేట మండలం నందిగాబమలో ఒక ఫైల్ట్రీఫామ్‌లోకి వరద నీరు ముంచెత్తడంతో పది వేల కోళ్ళ మృతి చెందాయి. శివ్వంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలో బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాల్లో వరద ఉధృతికి రైల్వే ట్రాక్‌ కింద గండి పడింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ళను రద్దు చేసింది. కాచిగూడ, నిజామాబాద్‌ వైపు వెళ్ళే అన్ని సర్వీసులను రద్దు చేసింది. కామారెడ్డి, బికనూర్‌, తలమడ్ల, అక్కన్నపేట, మెదక్‌ రైల్వే ట్రాక్‌ పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

Tags:    

Similar News