Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలు: నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ఎన్నికల సంఘం ఆదేశాలతో నోటిఫికేషన్ల జారీ
జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు
Local Body Elections: తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం నుంచి ప్రక్రియ మొదలవుతోంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ, స్టే ఉత్తర్వులు రాకపోవడంతో ఎన్నికల సంఘం ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించింది. మండల పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టిట్యూన్సీలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టిట్యూన్సీలు (జడ్పీటీసీ) ఎన్నికలను రెండు దశల్లో, గ్రామ పంచాయతీల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు సిద్ధమైంది. మొదటి దశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గురువారం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. 31 జిల్లాల్లోని 53 రెవెన్యూ డివిజన్లలో 292 జడ్పీటీసీలు, 2,963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కూడా ఆరంభమవుతుంది. 11వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో ప్రతి రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. బుధవారం హైకోర్టులో కేసు వాయిదా పడిన నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ నుంచి సలహా తీసుకున్న ఎన్నికల సంఘం, ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. అనంతరం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, నోటిఫికేషన్లు జారీ చేయాలని సూచించింది. ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అభ్యర్థుల వివరాలు, డిపాజిట్లు, నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన పత్రాలు నామినేషన్‌తోపాటు సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రక్రియ కొనసాగుతుందా అని కొందరు కలెక్టర్లు అడిగినపుడు, గురువారం హైకోర్టు నుంచి స్పష్టత వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
మొదటి దశ ఎన్నికల షెడ్యూలు ఇలా..
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: 9వ తేదీ
చివరి తేదీ: 11వ తేదీ
నామినేషన్ల పరిశీలన, అర్హుల జాబితా ప్రకటన: 12వ తేదీ
నామినేషన్ల ఉపసంహరణ: 15వ తేదీ
పోలింగ్: ఈ నెల 23వ తేదీ
ఓట్ల లెక్కింపు: నవంబరు 11వ తేదీ
ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో దశ ఎన్నికలకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రామ పంచాయతీల మొదటి దశ ఎన్నికలకు 17న, రెండో దశకు 21న నోటిఫికేషన్లు జారీ అవుతాయి.