Maha Varuna Yagam: నాగార్జునసాగర్ తీరంలో మహా వరుణయాగం.. పూర్ణాహుతికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
Maha Varuna Yagam: తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు సస్యశ్యామలం కావాలని, అన్నదాతల ముఖాల్లో సంతోషం వెల్లివిరియాలని, కృష్ణా-గోదావరి నదులు జలకళతో నిండాలనే శుభసంకల్పంతో నాగార్జునసాగర్‌లోని విజయపురి (విజయవిహార్)లో మహా వరుణయాగం శాస్త్రోక్తంగా జరిగింది.
సోమవారం ఉదయం 4.05 గంటలకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ పండితుల ఆధ్వర్యంలో, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతుల చేతుల మీదుగా ఈ క్రతువు ప్రారంభమైంది. 108 మంది రుత్వికులు, వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య 11 హోమగుండాలతో ‘ఓం వరుణదేవాయ నమః’ అంటూ యాగం సాగింది. గోపూజ, యాగప్రదక్షిణం, పుణ్యాహవాచనం, అంకురార్పణ, రుష్యశృంగ పూజలతో వరుణదేవుడిని ఆవాహన చేసి హోమాలు నిర్వహించారు. కృష్ణమ్మ ఒడ్డున చతుర్వేద పారాయణ సహితంగా ఈ మహాక్రతువు జరిగింది.
మధ్యాహ్నం 3.24 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత హాజరయ్యారు. రుత్వికులు సీఎం దంపతులను, మంత్రులను ప్రధాన వరుణమండపం మధ్యభాగంలో కూర్చోబెట్టి పూర్ణాహుతి పూర్తి చేశారు. ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం ఉందని వేదపండితులు పేర్కొన్నారు. నేటి నాగార్జునసాగర్ ప్రాంతం ఇక్ష్వాకుల రాజధాని విజయపురిగా ప్రసిద్ధి చెందిందని, ఆనాడే ఇక్కడ వరుణారాధన జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయని వారు తెలిపారు.
యాగం ముగిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి సతీసమేతంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నాగార్జునసాగర్ జలాశయాన్ని సందర్శించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాలు, జలాశయంలో నీటి నిల్వలపై ఆరా తీశారు. ప్రస్తుత నీటి నిల్వలు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎంతో ప్రస్తావించారు. దీనికి ముందు సీఎం దంపతులు హెలికాప్టర్‌లో బీసీ గురుకుల విద్యాలయ హెలిప్యాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి విజయవిహార్ అతిథి గృహం మీదుగా యాగస్థలికి వచ్చారు.
తెలంగాణ నేలపై సమృద్ధి వర్షాలు, రైతుల సంతోషం, నదుల జలకళ కోసమే ఈ మహా వరుణయాగం నిర్వహించామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.