Trump Towers: కోకాపేటలో ట్రంప్ టవర్స్ నిర్మాణం.. 65 అంతస్తులు, 450 లగ్జరీ ఫ్లాట్లు
65 అంతస్తులు, 450 లగ్జరీ ఫ్లాట్లు
Trump Towers: భాగ్యనగరంలో మరో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. కోకాపేటలోని గోల్డెన్ మైల్ రోడ్డులో ట్రంప్ టవర్స్ నిర్మాణం జరగనుంది. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నాయి.
మొత్తం 65 అంతస్తులతో రెండు టవర్లు నిర్మించబోతున్నారు. వీటిలో అత్యంత ఖరీదైన 450 ఫ్లాట్లు ఉండనున్నాయి. ఈ టవర్ల ఎత్తు 240 మీటర్లు ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన టవర్లుగా, దేశంలోనే అత్యంత ఎత్తైన ట్రంప్ టవర్లుగా ఇవి నిలవనున్నాయి. ఇప్పటికే రెరా అనుమతులు వచ్చాయి.
త్వరలో జరిగే భూమి పూజకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని ట్రిబెకా, ఐరా సంస్థలు తెలిపాయి. ముంబైకి చెందిన ట్రిబెకా డెవలపర్ ట్రంప్ బ్రాండ్‌తో ఇప్పటికే దేశంలో ఎనిమిది ప్రాజెక్టులు ప్రకటించింది. పుణె, ముంబై, కోల్‌కతా, గురుగ్రామ్‌లో నాలుగు పూర్తయ్యాయి. దక్షిణ భారతంలో తొలిసారి హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్ నిర్మిస్తోంది.
ట్రిబెకా డెవలపర్ వ్యవస్థాపకుడు కల్పేశ్ మెహతా మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నామని, అది ఇప్పుడు సాకారమవుతోందని అన్నారు. భూమి ధర మినహా ఈ ప్రాజెక్ట్‌కు రూ.1,700-1,800 కోట్లు ఖర్చవుతుందని, విక్రయాల ద్వారా రూ.3,500 నుంచి రూ.4,200 కోట్ల ఆదాయం రావచ్చని చెప్పారు.
ఒక్కో ఫ్లాట్ ధర రూ.5 కోట్ల నుంచి మొదలవుతుంది. 16 పెంట్‌హౌస్‌ల్లో ఇప్పటికే ఎనిమిది విక్రయమయ్యాయి. ఒక పెంట్‌హౌస్‌ను గరిష్ఠంగా రూ.62 కోట్లకు అమ్మినట్లు మెహతా వెల్లడించారు.