Minister for Health and Medical Services Damodar Raja Narasimha: వరంగల్‌లో రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి.. ఈ ఏడాది సూపర్ స్పెషాలిటీ ప్రారంభం
ఈ ఏడాది సూపర్ స్పెషాలిటీ ప్రారంభం
Minister for Health and Medical Services Damodar Raja Narasimha: రాష్ట్రంలో ఎంఎన్‌జే తర్వాత రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని వరంగల్‌లో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేలా వరంగల్ రీజనల్ క్యాన్సర్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పురోగతిపై చర్చించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.
ఎంజీఎం ఆసుపత్రిలో ప్రస్తుతం 29 స్పెషాలిటీల్లో వైద్య సేవలు అందుతున్నాయని, అదనంగా మరో 9 సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలను త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఇందుకు అవసరమైన చర్యలు అధికారులు తక్షణమే తీసుకోవాలని ఆదేశించారు. హనుమకొండలో ఐవీఎఫ్ సెంటర్‌తోపాటు డ్రగ్ అండ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని, రీజనల్ ఐ ఆసుపత్రిలో అత్యాధునిక కంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఎంజీఎంకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ హోదా గల వైద్యులను రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా నియమిస్తామని కూడా పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా తదితరులు పాల్గొన్నారు.