Nagarjuna Sagar : సాగర్ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి ఉత్తమ్
18 సంవత్సరాల తరువాత నాగార్జున సాగర్ నుంచి జూలైలో నీటి విడుదల;
పద్దెనిమిది సంవత్సరాల తరువాత జూలై మాసంలో నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నల్గొండ జిల్లా ఇంఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కుందూరు జయ్‌వీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్‌లతో కలసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో నాటి ప్రధాని నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వేసిన పునాది ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా మారిందన్నారు. నిర్ధిష్ట షెడ్యూల్‌కి ముందే ఎడమ కాలువ ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలంగాణ రైతాంగానికి బాసటగా నిలిచామని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఆరుసార్లు, శాసనసభ్యుడిగా ఒక సారి పార్లమెంట్ సభ్యుడిగా కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం తన అధృష్టంగా భావిస్తున్నాని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రైతాంగ సమస్యలు తెలిసన వాడిగా రైతులకు సమృద్ధిగా సాగు నీరు అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.