ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
- విద్యుత్ సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించండి
- ISO 9000 సర్టిఫికెట్ పొందడం అభినందనీయం
- Spdcl ఉన్నతాధికారులు, డైరెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఆధునిక యుగంలో వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా సేవలు అందించేందుకు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ప్రజా భవన్లో SPDCL ఉన్నతాధికారులు, డైరెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. విద్యుత్ సరఫరా క్రమంలో ఎక్కడైనా ట్రిప్ అయితే వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం వచ్చే FOMS(ఫీడర్ ఔటేజ్ మేనేజ్మెంట్ సిస్టం) అమలను నూటికి నూరు శాతం త్వరితగతిన చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. దక్షిణ విద్యుత్ మండలి పరిధిలో 6,500 ఫీడర్లు ఉండగా 5,500 ఫీడర్ల పరిధిలో FOMS అమల్లోకి తీసుకువచ్చినట్టు అధికారులు వివరించగా, మిగిలిన ఫీడర్ల పరిధిలోను త్వరితగతిన FOMS టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం సూచించారు.
ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్, వినియోగదారులకు మెరుగైన సేవలు, కార్యాలయంలో ఫైళ్ల పరిష్కారం వేగవంతంగా జరగడం వంటి పలు అంశాల ప్రాతిపదికగా SPDCL ISO 9000 సర్టిఫికెట్ పొందడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో మెరుగైన సేవలు ద్వారా మరిన్ని అవార్డులు సాధించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.
విద్యుత్ సిబ్బందికి కోసం రూపొందించిన ప్రత్యేక డ్రెస్ కోడ్ ను డిప్యూటీ సీఎం పరిశీలించి పలు సూచనలు చేశారు. సుదీర్ఘ అనుభవం, చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తులను డైరెక్టర్లుగా ఎంపిక చేసాం, ఈ నేపథ్యంలో మీ మీ విభాగాల్లో గత కాలంలో చేయలేకపోయిన పనులను ఒక ప్రణాళిక ప్రకారం ఎవరి పరిధిలో వారు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం డైరెక్టర్లకు సూచించారు.
విద్యుత్ శాఖ ద్వారా అనేక రకాల సేవలను వినియోగదారులకు అందిస్తున్నారు. 108 అంబులెన్స్ తరహాలో విద్యుత్ శాఖలో 1912 నంబర్ కు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తున్నారు, ERT ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రత్యేక వాహనంతో సమస్యలు ఉన్నచోట క్షణాల్లో ప్రత్యక్షమై సమస్యలు పరిష్కరిస్తుంది, 70 శాతం లోడ్ చేరుకోగానే కొత్త ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ విద్యుత్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ప్రణాళికా ప్రకారం పనిచేస్తున్నారు. ఈ అంశాల పైన వినియోగదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు. సోలార్ పవర్ కు సంబంధించిన సమగ్ర ప్రణాళికను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం దానిని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో విద్యుత్ శాఖ సీఎండి నవీన్ మిట్టల్, SPDCL సిఎండి ముషారఫ్ ఫారుకి తోపాటు డైరెక్టర్లు, CE లు పాల్గొన్నారు.