Munugode MLA Komatireddy Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లేకపోవడంపై ఆగ్రహం
ఆగ్రహం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఉద్యమం, కాంగ్రెస్‌తో సంబంధం లేని వారికే కీలక పదవులు.. అప్పులు, ఆంధ్రా కాంట్రాక్టర్లపై ఆరోపణలు
వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చి కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం
Munugode MLA Komatireddy Rajagopal Reddy: తెలంగాణ ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనివాళ్లు ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారని, ఆ సొమ్మంతా ఆంధ్రా కాంట్రాక్టర్లే దోచుకుంటున్నారని ఆరోపించారు.
గురువారం సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘ఏపూరి సోమన్న 25 ఏండ్ల పాటల ప్రవాహం’ పుస్తకావిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ... ఏపూరి పాడిన ‘ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ’ పాటలో ప్రస్తావించిన పరిస్థితులే నేటికీ సజీవంగా ఉండటం బాధాకరమన్నారు. ‘నేను గెలిపించిన ఓ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మా కులాన్ని తిడతావా అంటున్నారు.. నిజమే.. మరి తప్పులు చేస్తూ కులాన్ని వాడుకోవడం మంచిదేనా’ అని ప్రశ్నించారు. కొందరు నేతలు ఎన్నికల్లో గెలవక ముందు ఒక తీరుగా, గెలిచిన తర్వాత మరోరకంగా మారిపోతున్నారని... పెద్ద పెద్ద కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. గతంలో భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా గళం విప్పింది తానేనని, అందుకే అప్పటి సీఎం కేసీఆర్ తనను టార్గెట్ చేశారన్నారు. రాజకీయాలను మార్చే శక్తి, గుండెల్లో నిజాయతీ తమకు ఉందని, ఎంత మంది డబ్బు సంచులతో వచ్చినా రాష్ట్ర రాజకీయాలను తమిళనాడు తరహాలో మార్చివేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పుష్పలత, గాయకుడు నర్సన్న, పలువురు గాయకులు పాల్గొన్నారు.
ఈ వ్యాఖ్యలపై శుక్రవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్‌రెడ్డి మరోసారి మీడియాకు క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేశారు. తానెక్కడా కాంగ్రెస్ నాయకులను విమర్శించలేదని, విమర్శించనని తేల్చిచెప్పారు. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణిచివేస్తున్నారనే విషయాన్ని తాను గుర్తు చేశానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా ఉద్యమకారులకు గుర్తింపు ఉండాలని సూచించారు. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్, ప్రభుత్వం నడపవద్దని కోరారు. ప్రజాపాలన అంటే పేదల కోసం పని చేయాలని, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లకు సీమాంధ్ర నాయకుల కోసం కాదని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు.