Nija Nirdharana Yatra: తెలంగాణను తొమ్మిదిన్నరేళ్లు పాలించి ప్రభుత్వ, అసైన్డ్‌, ఇనాం భూములను ఆక్రమించి జలవనరులను కబ్జా చేసిన కేసీఆర్‌ కుటుంబ దోపిడీని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బట్టబయలు చేశారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ కుటుంబ సభ్యులతోపాటు భారాస నాయకులు చేసిన దారుణాలను బహిర్గతం చేసేందుకు నిజనిర్ధారణ యాత్ర చేపట్టామని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం మద్దూరులో సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌ను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సోమవారం సందర్శించారు. జగదీశ్‌రెడ్డికి మద్దూరులోని సర్వే నంబర్లు 162, 223లలోని 50 ఎకరాల్లో సుమారు 12 ఎకరాల ఇనాం భూములున్నాయని, జలవనరులనూ ఆక్రమించారని ఆరోపించారు.

ఎంపీ చామల మాట్లాడుతూ.. ‘‘జగదీశ్‌రెడ్డి మాయచేసి రూ.వందల కోట్లు సంపాదించారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన ఆస్తి రూ.12 లక్షలుగా చూపించారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఆస్తులు రూ.వందల కోట్లకు ఎలా పెరిగాయి? రంగారెడ్డి జిల్లాలో 50 ఎకరాల ఫాంహౌస్‌ ఎలా నిర్మించారు? ఇందులోనూ సుమారు 12 ఎకరాల ఇనాం భూమి ఉంది. వీటిని వెంటనే స్వాధీనం చేసుకుని అర్హులైన వారికి అందించాలని కలెక్టర్‌ను కోరుతున్నాం’’ అన్నారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రాకముందు జగదీశ్‌రెడ్డి ఆస్తి మూడు ఎకరాల చలక, రెండు దున్నపోతులు మాత్రమేనని, స్వగ్రామం నాగారంలో 100 ఎకరాలు చెరబట్టారని ఆరోపించారు. ఆయన భార్య సొంతూరైన ఇప్పర్తిలో 80 ఎకరాలు సొంతం చేసుకున్నారన్నారు.

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ.. జగదీశ్‌రెడ్డి మద్దూరులో కొన్న 50 ఎకరాల ఫాంహౌస్‌ మునిగిపోకుండా రోడ్లు వేయించారని, చేగూరు గ్రామ శివారులోని 433, 213 సర్వే నంబర్లలో గుట్టను తొలగించి మట్టిని కాలువలో వేసి మూసేయించారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు బలరాం నాయక్‌, సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యేలు నవీన్‌యాదవ్‌, బీర్ల ఐలయ్య, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ పాల్గొన్నారు.

Tags: