Minister Uttam: ప్రాజెక్టులకు భూసేకరణ వేగం పెంచాలి.. రైతులకు ₹813 కోట్లు వెంటనే చెల్లించాలి: మంత్రి ఉత్తమ్
మంత్రి ఉత్తమ్
Minister Uttam: ప్రాజెక్టుల నిర్మాణాల కోసం భూసేకరణ, పునరావాస ప్రక్రియలు వేగంగా పూర్తయ్యేలా పరిహారం చెల్లింపులు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, భూసేకరణ కమిషనర్ శివకుమార్ నాయుడితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన ₹813 కోట్లను జాప్యం లేకుండా రైతులకు అందించాలని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు సమాచారం ఇస్తూ.. ఏప్రిల్ నుంచి నేటి వరకు ₹3,101 కోట్లకు టోకెన్లు సమర్పించగా ప్రభుత్వం ₹2,504 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. జిల్లాల స్థాయిలో ₹502 కోట్లు అధికారుల వద్ద, ₹311 కోట్లు జిల్లా కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
దీంతో మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “నిధులు విడుదలైన తర్వాత తప్పనిసరిగా భూములు కోల్పోయిన రైతులకు చేరాలి. కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ తీసుకుని రైతులతో సంప్రదింపులు చేసి పరిహారం పంపిణీ పూర్తి చేయాలి. భూములు కోల్పోతున్న రైతుల పట్ల అధికారులు న్యాయబద్ధంగా, మానవీయంగా వ్యవహరించాలి” అని సూచించారు.
నల్గొండ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, సిద్దిపేట, వికారాబాద్, జగిత్యాల, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాజెక్టుల కింద భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలపై జిల్లాల వారీగా సమీక్ష జరిగింది.