NIMS: నిమ్స్‌లో 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలు-రెండున్నరేళ్లలో మైలురాయి.. సీఎం, మంత్రి అభినందనలు

సీఎం, మంత్రి అభినందనలు

Update: 2026-08-03 14:10 GMT

NIMS: నిమ్స్ ఆసుపత్రిలో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.

సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిమ్స్ వైద్య బృందం మంత్రి దామోదర రాజనర్సింహను కలిసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడానికి నిమ్స్ నిదర్శనమని పేర్కొన్నారు. దక్షిణ భారత ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ను నిమ్స్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికే రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన నిమ్స్.. ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకుందని చెప్పారు.

మంత్రి వివరాలు ఇలా చెప్పారు: యూరాలజీలో 590, గ్యాస్ట్రోలో 248, ఆంకాలజీలో 162 రొబోటిక్ శస్త్రచికిత్సలు జరిగాయి. 90 శాతానికి పైగా సర్జరీలు ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించారు. ఎంఎన్‌జే ఆసుపత్రిలో కూడా రొబోటిక్ సర్జరీలు విజయవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కొత్త టిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ విజయాన్ని అభినందిస్తూ.. నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పం నెరవేరిందని వ్యాఖ్యానించారు. వైద్య రంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News