No EVM Only Ballet : ఈవీఎంలు వద్దు... బ్యాలెట్ విధానం మళ్లీ తీసుకురండి
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేటీఆర్ బృందం;
- ఈవీఎంలపై అనుమానాలున్నాయని వెల్లడి
- తమ కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని వినతి
- బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నిలిపివేయాలని విజ్ఞప్తి
ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) వాడకంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటి స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మంగళవారం నాడు ఢిల్లీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులతో సమావేశమై పలు కీలక అంశాలపై వినతిపత్రం సమర్పించింది. ఈవీఎంల విశ్వసనీయతపై గత కొన్నేళ్లుగా అనేక సందేహాలు తలెత్తుతున్నాయని, చాలా రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ తమ వినతిపత్రంలో పేర్కొంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలు కూడా జాతీయ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లనే వాడుతున్నాయని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో, ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని అమలు చేయాలని కోరింది. అదేవిధంగా, బీహార్‌లో ప్రస్తుతం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు చేపట్టడం అనవసరమని, దీనివల్ల వలస కార్మికులు, బలహీన వర్గాలకు చెందిన ఓటర్ల పేర్లు పెద్ద ఎత్తున తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సవరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. తమ పార్టీకి కేటాయించిన 'కారు' గుర్తును పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్‌గా కేటాయించడంపై బీఆర్ఎస్ మరోసారి తన అభ్యంతరాన్ని వినిపించింది. ముఖ్యంగా కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, టీవీ వంటి 8 గుర్తులు బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలపై చిన్నగా కనిపించినప్పుడు ఓటర్లను, ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులను గందరగోళానికి గురిచేస్తున్నాయని తెలిపింది. ఈ గుర్తుల వల్ల గతంలో తమకు రావాల్సిన ఓట్లు పక్కదారి పట్టాయని, 2019 భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో ఇదే జరిగిందని ఉదహరించింది. ఈ 8 గుర్తులను తక్షణమే తొలగించాలని కోరింది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో తాము చేసిన ఫిర్యాదులపై ఈసీ సకాలంలో స్పందించలేదని బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యర్థి పార్టీల నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగిందని ఆరోపించింది. కేటీఆర్ నేతృత్వంలోని ఈ బృందంలో రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్, సీనియర్ నేతలు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.