BRS KTR Teleconference : వరద సహాయక చర్యల్లో పాలు పంచుకోండి
టెలీకాన్ఫరెన్స్‌లో శ్రేణులకు దిశానిర్దేశం చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్;
భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయ్యిందని, ఈ కష్ట కాలంలో కార్యకర్తల నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ అందరూ సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గడచిన మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగి అనేక జిల్లాలు జలమయ్యాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్‌ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నేతలు ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమయ్యిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ప్రజల వెంట నిలబడే పార్టీ అని అందువల్ల కార్యకర్తలు, నాయకులు ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని కేటీఆర్ సూచించారు. మన హాయాంలో వర్ష సూచన ఆధారంగా అనేక సూక్ష్మమైన అంశాలపై దృష్టి పెట్టేవాళ్ళమని, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయ, పునరావాస కార్యక్రమాలను చేసేవాళ్లమని కేటీఆర్ గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు ప్రస్తుత ప్రభుత్వం మనం స్పందించి ఒత్తిడి తీసుకువచ్చే వరకు కూడా పెద్దగా స్పందించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. వరదల్లో చిక్కుకున్న వారికి, వర్షాల వల్ల నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. తీవ్రమైన వరద ఉన్న చోట ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు అందించాలని పార్టీ క్యాడర్‌కి సూచించారు. అవసరమైన చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. మనం చేసే ప్రతి సహకారాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.