Kaleswaram : సీయంకు చేరిన కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీఘోష్ విచారణ నివేదిక
నివేదిక అధ్యయనం చేసి సారాంశం సిద్దం చేయడానికి త్రిసభ్యకమిటీని నియమించిన ప్రభుత్వం;
కాళేశ్వరం ప్రాజెక్టుల కింద బ్యారేజిల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయడానికి నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అందజేశారు. జూబ్లీహిల్స్‌లోని సియం నివాసంలో సీయంను కలిసిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాళేశ్వరం కమిషన్ మూడు భాగాలుగా ఇచ్చిన నివేదికను సీల్డ్ కవర్ లో అందజేశారు. నివేదిక అందుకున్న వెంటనే జస్టిస్ పీసీఘోష్ నివేదికను అధ్యయనం చేయడానికి ఒక త్రిసభ్య కమిటీ నియమిస్తూ సీయం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇరిగేషన్, న్యాయ, జీఏడీ శాఖల కార్యదర్శులతో ఈ త్రిసభ్య కమిటీ నియమించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాభుల్ బొజ్జా, జీఏడీ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, న్యాయ శాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతిలను కమిటీలో సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ త్రిసభ్య కమిటీ జస్టిస్ పీసీఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను అధ్యయనం చేసి సంక్షిప్తంగా నివేదిక సారాంశాన్ని తయారు చేసి ఇవ్వాలి. ఆగస్టు 4వ తేదీన జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలోగా త్రిసభ్య కమిటీ తన నివేదికను సమర్పించాలని గడువు విధించారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీఘోష్ నివేదికపై చర్చిండమనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ఈ సారి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈసారి జరిగే మంత్రివర్గ సమావేశంలో జస్టిస్ పీసీఘోష్ నివేదికపై త్రిసభ్య కమిటీ సమర్పించే జిస్ట్‌పై విస్తృతంగా చర్చ జరిపి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై క్యాబినేట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే రానున్న వర్షాకాల సమావేశాల్లో పీసీఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి జస్టిస్ పీసీఘోష్ నివేదికను సియంకు అందించిన సమయంలో అక్కడే ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో ఈ విషయంపై సీయం చర్చలు జరిపారు.