కాంగ్రెస్ ముక్త భారత్ చూడాలని ప్రజలు అనుకుంటున్నారు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఎన్.రామచంద్రరావు;
కాంగ్రెస్ ముక్త భారత్‌ని ప్రజలు చూడాలనుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ అధ్యక్షుడి కిషన్ రెడ్డి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని త్వరలో కాంగ్రెస్ ముక్త తెలంగాణ సాధిద్దామన్నారు. తాను సైకిళ్ళ మీద తిరిగి బ్యానర్లు కట్టి బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంట్ స్ధాయి నుంచి పని చేసుకుంటూ వచ్చానని రామచంద్రరావు చెప్పారు. కార్యకర్తగా నా పనితీరు చూసి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. ఎంతో మంది త్యాగాలతో పార్టీ ఈ స్ధాయికి వచ్చిందన్నారు. కార్యకర్తల ఆశీర్వాదంతోనే తాను ఈ స్ధాయికి వచ్చినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ తెలంగాణను మోసం చేశాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయని టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. డబ్బులు లేవు, పరిస్ధితి బికారిగా మారిందని ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే అని ఎద్దేవా చేశారు. గతంలో రెండు దఫాలు రైతు భరోసా ఎగ్గొట్టి ఇప్పుడు స్థానిక సంస్ధల ఎన్నికలు ఉన్నాయని రైతు భరోసా ఇచ్చారని రామచంద్రరావు రేవంత్ సర్కార్ని విమర్శించారు. వ్యవసాయ మంత్రి ఎరువుల కొరత ఉందని చెపుతున్నారని, అధికంగా కేంద్రం కేటాయించిన రెండు లక్షల మెట్రిక్ టన్నల యూరియా ఏం చేశారని ఆయన నిలదీశారు. సామాజిక న్యాయ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రధాని మోడీని తిట్టడంతోనే సరిపోయిందని విమర్శించారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చుక్కలు చూపిస్తారని రామచంద్రరావు అన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో వార్డ్ మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకూ అన్ని స్థానాల్లో కార్యకర్తల బలంతోనే బీజేపీ పోటీ చేస్తుందని రామచంద్రరావు ప్రకటించారు. వికసిత తెలంగాణ కోసం, డబుల్ ఇంజన్ సర్కార్ కోసం కార్యకర్తలంతా కస్టపడి పనిచేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.