Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు: పెన్ డ్రైవ్‌లో సంచలన ఆధారాలు... సిట్ దర్యాప్తు ముమ్మరం
సిట్ దర్యాప్తు ముమ్మరం
Phone Tapping Case: తెలంగాణలో పెను సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారణను తీవ్రతరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ఈ పెన్ డ్రైవ్ చుట్టూనే ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
సమాచారం ప్రకారం... ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివరాలను ఈ పెన్ డ్రైవ్‌లో నిల్వ చేసినట్లు సిట్ గుర్తించింది. పెన్ డ్రైవ్‌లో వందలాది ఫోన్ నంబర్లు ఉన్నాయి. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీలకు సంబంధించిన ప్రొఫైల్స్ కూడా ఇందులో సేవ్ చేశారు.
సిట్ అధికారులు ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారణ జరుపుతున్నారు. దీంతోనే ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నంబర్లను గుర్తించగలిగారు. ప్రభాకర్ రావు బృందం అన్ని ఆధారాలను ధ్వంసం చేసినప్పటికీ... ఈ పెన్ డ్రైవ్‌ను సిట్ స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
కేసును నిరూపించడానికి ఈ పెన్ డ్రైవ్ బలమైన ఆధారంగా మారిందని సిట్ అధికారులు భావిస్తున్నారు. రేపు వరకు ప్రభాకర్ రావు నుంచి మరిన్ని వివరాలు సేకరించే అవకాశం ఉంది.
ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు సమాచారం.