Priyanka: రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక (28) మృతదేహానికి సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆమె స్వస్థలం గద్వాల్ జిల్లా ఐజా మండలం ఎక్లాస్‌పూర్‌కు తరలించనున్నారు.

రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రియాంకను ఢీకొన్న ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని కిమ్స్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

గాంధీ ఆస్పత్రి వద్ద తెలంగాణ మంత్రి వాకటి శ్రీహరి, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రియాంక తండ్రిని కలిసి ఓదార్చారు. తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి, పోస్టుమార్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రియాంక మృతదేహం వెంట రాజమహేంద్రవరం టీడీపీ అధ్యక్షుడు వెంకట రమణా చౌదరి గ్రామానికి వెళ్లనున్నారు. ఏపీ మంత్రి టీజీ భరత్ స్వగ్రామానికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల చెక్‌ను ప్రియాంక తండ్రికి అందజేయనున్నారు.

ఈ కేసుపై రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా మూడు గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, లోతైన విచారణ పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను రిమాండ్‌కు పంపామని, ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు, అపోహలను నమ్మవద్దని, అమ్మాయి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని హితవు పలికారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం పోలీసులు కేసులో సెక్షన్లు మార్చి నిందితులపై హత్య నేరం మోపారు. ప్రియాంక తల్లిదండ్రులు తమ కలల సౌధం కూలిపోయిందంటూ బోరున విలపిస్తున్నారు.

Tags: