CM Revanth Reddy: గాంధీ, అంబేడ్కర్‌ల మార్గంలో రాహుల్, ఖర్గే.. మోదీ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం: సీఎం రేవంత్

మోదీ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం: సీఎం రేవంత్

Update: 2025-12-15 11:29 GMT

ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారసులు

మోదీ కుట్రలను అడ్డుకోకపోతే పేదలు ఓటు హక్కు, ఆధార్-రేషన్ కార్డులు కోల్పోతారు

సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక

CM Revanth Reddy: రాజ్యాంగ నిర్మాణ కాలంలో పేదలకు, దళితులకు, ఆదివాసీలకు ఓటు హక్కు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు గోల్వాల్కర్ భావజాలానికి అప్పట్లో మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిలబడ్డారు. ఇప్పుడు అదే భావజాలాన్ని అమలు చేయాలని చూస్తున్న నరేంద్ర మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు పోరాటం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు.

ఆదివారం దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘ఓట్ చోర్... గద్దీ ఛోడ్’ ఆందోళన సభలో ఆయన ప్రసంగించారు. ‘‘రాజ్యాంగ సభలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదవర్గాలకు ఓటు హక్కు ఇవ్వాలనే చర్చలో గోల్వాల్కర్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ గాంధీ, అంబేడ్కర్‌ల పట్టుదలతో పేదలు ఓటు హక్కు పొంది, ప్రభుత్వాల ఏర్పాటులో భాగస్వాములయ్యారు.

ఇప్పుడు మోదీ-అమిత్ షా గోల్వాల్కర్ ఆలోచనలను అమలుచేయడానికి గత లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు కోరారు. అలా ఇస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేస్తారని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రజలు భాజపాను 240 సీట్లకే పరిమితం చేయడంతో రాజ్యాంగం కాపాడబడింది’’ అని రేవంత్ వివరించారు.

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర

400 సీట్లు రాకపోవడంతో భాజపా నాయకులు పగతో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో దళితులు, ఆదివాసీలు, పేదల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘అప్పటి గాంధీ-అంబేడ్కర్ లాగానే ఇప్పుడు రాహుల్-ఖర్గేలు మోదీకి వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఇది కాంగ్రెస్ సమస్య మాత్రమే కాదు, దేశ సమస్య. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలంతా రాహుల్‌కు అండగా నిలవాలి. లేకపోతే ఓటు హక్కు పోతుంది. ఓటర్ లిస్ట్ నుంచి పేరు తొలగితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు రద్దవుతాయి. తర్వాత భూములు, ఆస్తులు కూడా లాగేసుకుంటారు. ఆదివాసీలు పూర్తిగా నిరాశ్రయులవుతారు. అందరూ రాహుల్ సిపాయిలుగా మారి మోదీకి వ్యతిరేకంగా పోరాడాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.

సభలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News