Mla Rajasing : రాజాసింగ్‌ కు బీజేపీ అధిష్టానం ఝలక్... రాజీనామా ఆమోదం

మీరు ప్రస్తావించిన అంశాలు పార్టీ సిద్దాంతానికి విరుద్దంగా ఉన్నాయన్న అధిష్టానం;

Update: 2025-07-11 08:51 GMT

గోషామహల్‌ శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీకి చేసిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా ఆమోదించారు. ఈమేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కు లేఖ రాశారు. జూన్‌ 30వ తేదీన మీరు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డికి సమర్పించిన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా దృష్టికి తీసుకు వెళ్లామని, ఆ రాజీనామా లేఖలో మీరు పేర్కొన్న అంశాలు అసంబద్దమైన, పార్టీ మౌలిక సిద్దాంతానికి, భావజాలానికి విరుద్దంగా ఉన్నాయని పార్టీ అధిష్టానం అభిప్రాయపడిందని రాజా సింగ్‌ కు రాసిన లేఖలో అరుణ్‌ సింగ్‌ పేర్కొన్నారు. జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా సూచనల మేరకు మీ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పష్టం చేస్తూ రాజాసింగ్‌ కు బీజేపీ అధిష్టానం నుంచి లేఖ అందింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నారపరాజురామచంద్రరావుని ఎంపిక చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా లేఖను కిషన్‌ రెడ్డికి పంపారు. వాస్తవానికి చాలా కాలం నుంచి రాజా సింగ్‌ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. కిషన్‌ రెడ్డి అధ్యక్షుడు అయిన నాటి నుంచి రాజాసింగ్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై మాటల యుద్దం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల రామచంద్రరావును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ్ని చేయడం రాజా సింగ్‌ కు మింగుడు పడలేదు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా లేఖ పంపారు. ఇప్పుడు రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News