Kavitha Fires at CM Revanth Reddy: గిరిజన సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయండి.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్
సీఎం రేవంత్‌పై కవిత ఫైర్
సింగరేణి కార్మికుల సంక్షేమం పక్కనపెట్టి ఫుట్‌బాల్‌కు రూ.10 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ.. భద్రాద్రి జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి
Kavitha Fires at CM Revanth Reddy: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివాసులు, గిరిజనుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందో స్పష్టంగా వెల్లడించేలా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాచలం పర్యటనలో మీడియాతో మాట్లాడిన కవిత.. సింగరేణి పుట్టినిల్లు ఇల్లందులో నూతన బొగ్గు గనులు ప్రారంభించాలని కోరారు.
సింగరేణి కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ కార్యక్రమాలకు రూ.10 కోట్లు ఖర్చు పెట్టారని కవిత ఆరోపించారు. ముగ్గురు మంత్రులు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రాధాన్యత లేదని, కనీసం ఒక మంత్రి కొత్తగూడెంను దత్తత తీసుకోవాలని సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
మణుగూరు ఓపెన్ కాస్ట్-2 ప్రాజెక్టు ప్రైవేటీకరణను తాము అడ్డుకుంటామని కవిత స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు నీటిని భద్రాద్రి జిల్లా పొలాలకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఎటపాక, పురుషోత్తమపట్నం, గుండాల, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం గ్రామాలను భద్రాచలం డివిజన్‌లో చేర్చాలని, పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.
అశ్వరావుపేట పెద్దవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం శ్రీరామాలయ అభివృద్ధికి ప్రసాద్ స్కీంలో రూ.200 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.
కొత్తగూడెం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో గత, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు. కొత్తగూడెం బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆదివాసులు, గిరిజనులకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వారిని నిర్లక్ష్యం చేయొద్దని, సింగరేణి నిర్వాసిత గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కవిత డిమాండ్ చేశారు.