Revanth Reddy Roars: రేవంత్ రెడ్డి గర్జన: “గాంధీ కుటుంబం మీద కేసులా? మాకు భయం అంటే తెలియదు .. తెలంగాణ అభివృద్ధి రాకెట్ స్పీడ్‌లో!”
తెలంగాణ అభివృద్ధి రాకెట్ స్పీడ్‌లో!”
Revanth Reddy Roars: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై కేసులు పెట్టితే భయపడేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి వీరు ఆర్థిక సహాయం అందించారని, ప్రైవేట్ సంస్థల్లో పని చేసినవారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవని నేపథ్యంలో ఎప్పుడో మూతపడిన ఆ పత్రికా సిబ్బందిని మంచి ఆలోచనతో ఆదుకున్నారని గుర్తు చేశారు. పత్రికను తిరిగి నడపాలనే ఉద్దేశ్యంతో బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కొంతమంది కాంగ్రెస్ నేతలను తీసుకున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలని నిర్ణయించి, నేషనల్ హెరాల్డ్ పత్రిక పునరుద్ధరించే ప్రక్రియను వారు చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. మంగళవారం హైదరాబాద్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను సోదాహరణలతో వివరించారు.
ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచస్థాయిలో నిలబెడతాం: సీఎం రేవంత్
డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తామని చెప్పారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు అయినా నిధులు కేటాయిస్తామని, ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతామని ప్రకటించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, 9న తెలంగాణ-2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి దిగ్గజ నేతల సలహాలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఓఆర్ఆర్ బయటకు కాలుష్య పరిశ్రమలు తరలిస్తాం..
కోర్ అర్బన్‌ను క్యూర్ చేయాలని నిర్ణయించామని, కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, పరిశ్రమల తరలింపు వంటి అంశాలు తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించారు. కొన్ని పరిశ్రమలు నడిచే పరిస్థితి లేక మూతపడ్డాయని, మరికొన్ని నగర బొడ్డున ఉన్నాయని, వాటిని తరలిస్తే భూమి అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పై నిప్పులు..
అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకెళ్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో తెలంగాణకు ఒక్క ఎయిర్‌పోర్టు కూడా తీసుకురాలేదంటూ బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఎయిర్‌పోర్టులు తెచ్చామని గుర్తు చేశారు. సంక్షోభంలో ఉన్న తెలంగాణను సంక్షేమం దిశగా తీసుకెళ్తున్నామని, 2034 నాటికి వన్ ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. అందరి కృషితో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అన్నారు.
డీసీసీలకు హెచ్చరిక..
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. కోటి మంది మహిళలకు చీరలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. చీరలు అందలేదంటూ ఫిర్యాదులు వస్తే అందుకు డీసీసీల బాధ్యత అని హెచ్చరించారు. డిసెంబర్ నెలాఖరులోగా మహిళలందరికీ చీరలు అందించాలని డీసీసీలకు స్పష్టం చేశారు.