Sirdharbabu : శ్రీకృష్ణ శోభాయాత్ర మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
గాంధీ ఆసుపత్రి సందర్శించి క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు;
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామాంతపూర్‌లో జరిగిన శోభాయాత్రలో విద్యుదాఘాతానికి గురై ఆరుగురు మృతి చెందడం పట్ల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించి క్షతగాత్రులను మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించారు. ఈ సందర్భగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రామాంతపూర్ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు 5లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడ్డవారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఈ దురదృష్టకర సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి శ్రీధర్‌బాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరో వంద మీటర్ల దూరంలో శోభాయాత్ర ముగుస్తుందనగా ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. కేబుల్ వైర్ ద్వారా కరెంట్ సరఫరా జరిగి ప్రమాదం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారని, ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేయాలని కలెక్టర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. దర్యాప్తు నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబుల్ వైర్లు, కరెంటు తీగలపై స్పెషల్ డ్రైవ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు.