Kishan Reddy: సింగరేణికి పీకేఓసీ-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు.. హర్షం వ్యక్తం చేసిన కిషన్‌రెడ్డి

హర్షం వ్యక్తం చేసిన కిషన్‌రెడ్డి

Update: 2026-08-03 14:15 GMT

Kishan Reddy: పీకేఓసీ-2 డిప్‌సైడ్ కోల్‌బ్లాక్ సింగరేణి కొల్లరీస్‌కు దక్కడం సంతోషకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, సింగరేణి అధికారులు, తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇటీవల ఒడిశాలోని నైని కోల్‌బ్లాక్, తాడిచర్ల-2 బ్లాక్‌లు సింగరేణికి దక్కిన సందర్భంలో పీకేఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను కూడా సంస్థకే కేటాయించాలని కార్మికులు, యూనియన్ నాయకుల నుంచి డిమాండ్లు వచ్చాయని ప్రస్తావించారు. ఈ బ్లాక్ సింగరేణికి రావడానికి తాను అన్ని విధాలా కృషి చేశానని చెప్పారు. కేంద్ర మంత్రిగా మాత్రమే కాకుండా తెలంగాణ బిడ్డగా, సింగరేణి శ్రేయస్సు, అభివృద్ధి, కార్మికుల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తిగా ప్రత్యేకంగా కృషి చేశానని పేర్కొన్నారు.

ఈరోజు (ఆగస్టు 3) వేలం ప్రక్రియ పూర్తయిందని, మణుగూరు పీకేఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించినట్లు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణికి ఈ బ్లాక్ వల్ల సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు లభిస్తాయని వెల్లడించారు. సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్లపాటు ఈ గని నడుస్తుందని స్పష్టం చేశారు.

దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, ఇక్కడ దొరికే జీ-8 (మంచి నాణ్యత) బొగ్గు కారణంగా మొత్తం రూ.43 వేల కోట్లకు పైగా రెవెన్యూ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు మించి ఆదాయం వస్తుందని వివరించారు. తెలంగాణ ఇంధన భద్రతకు భరోసా దక్కడంతో పాటు సింగరేణి భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన వనరులు లభిస్తాయని, ప్రభుత్వం, సింగరేణి, విద్యుత్ రంగం, ఉద్యోగులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News