Minister Komatireddy Venkat Reddy: మహిళా ఐఏఎస్ అధికారిణిపై దుష్ప్రచారం దురదృష్టకరం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
దుష్ప్రచారం దురదృష్టకరం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Minister Komatireddy Venkat Reddy: రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న అవాస్తవ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై జరుగుతున్న దుష్ప్రచారం దురదృష్టకరమని, ఇలాంటి వ్యాఖ్యలు కుటుంబాలను మానసికంగా ఇబ్బంది పెడతాయని ఆయన వ్యాఖ్యానించారు.
"మంత్రులపై మాత్రమే కాదు, ముఖ్యమంత్రిపై కూడా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది సరికాదు. చాలా జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర అధికారుల బదిలీలు జరిగాయి. ఇవి మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే పరిపాలనా విధానం ప్రకారం జరుగుతాయి. అధికారులపై అభాండాలు వేయడం, రేటింగ్స్, వ్యూస్ కోసం అవాస్తవ వార్తలు రాయడం మంచిది కాదు" అని మంత్రి స్పష్టం చేశారు.
ఛానెళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, ఇలాంటి ప్రచారాల వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని, వారిని అనవసరంగా ఇబ్బంది పెట్టవద్దని మంత్రి హితవు పలికారు.
ఈ విషయంపై ఐపీఎస్ అధికారుల సంఘం కూడా ఇటీవలే స్పందించి, మహిళా ఐఏఎస్‌పై వచ్చిన వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.