Telangana Speaker Delivers Key Verdict: ఐదుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేత.. స్పీకర్ కీలక తీర్పు

స్పీకర్ కీలక తీర్పు

Update: 2025-12-17 12:01 GMT

Telangana Speaker Delivers Key Verdict: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ గుర్తుపై ఎన్నికై కాంగ్రెస్‌లో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను తోసిపుచ్చారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తుమ్మల ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీలపై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లలో పార్టీ ఫిరాయింపుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ తేల్చారు. సాంకేతికంగా ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లోనే ఉన్నారని తీర్పులో స్పష్టం చేశారు.

మొత్తం 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా, ఎనిమిది మందిపై విచారణ పూర్తయింది. వీరిలో ఐదుగురిపై ఇవాళ తీర్పు వెలువడగా.. మిగతా ముగ్గురు – పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లపై గురువారం నిర్ణయం రానుంది. అలాగే దానం నాగేందర్, కడియం శ్రీహరిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కోరినట్టు తెలుస్తోంది.

ఈ అనర్హత కేసులు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేగవంతమయ్యాయి. బీఆర్‌ఎస్ దాఖలు చేసిన కంటెంప్ట్ పిటిషన్‌పై ఈ నెల 19న మరోసారి విచారణ జరగనుంది. స్పీకర్ నిర్ణయంపై బీఆర్‌ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. దీన్ని హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ తీర్పుతో ఐదుగురు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. అయితే మిగతా పిటిషన్లపై నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News