Speaker Gaddam Prasad Kumar: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉన్నా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోబోమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, తాను ప్రజాస్వామిక పద్ధతిలోనే సభను నడుపుతున్నానని అన్నారు.

‘‘శాసనసభలో సభ్యుడు కాకపోయినా తాతా మధుపై చర్యలు తీసుకునే అధికారం నాకుంది. కానీ బీఆర్‌ఎస్‌లా వెంటనే బహిష్కరించలేను. ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నాం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ఆలోచన మాకు లేదు’’ అని స్పీకర్ అన్నారు.

నిన్నటి సంఘటనలతో తాను బీఆర్‌ఎస్ నేతలకు మైక్ ఇవ్వనని స్పష్టం చేశారు. ‘‘ఈరోజు తనకు బీఆర్‌ఎస్ నేతలు క్షమాపణ చెబుతారని అనుకున్నాను. కానీ క్షమాపణ చెప్పకుండా సభను డైవర్షన్ చేస్తున్నారు. తాను మొదటిసారి బీఆర్‌ఎస్ సభ్యులపై కోప్పడుతున్నాను. తనను ఎవరూ ఎప్పుడూ ఏం అనలేదు. తానెప్పుడూ మీడియా ముందుకు రాలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

తాతా మధు వ్యాఖ్యలతో ఈరోజు చైర్‌లో కూర్చోవాలని లేదని, సభను నడిపించలేకపోతున్నానని చెప్పారు. ప్యానల్ స్పీకర్‌గా కడియం శ్రీహరిని నియమించి సభను నడిపిస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పాలని, ప్రతి సెషన్ ముందు ఆయన్ను సభకు హాజరు కావాలని కోరుతున్నానని స్పీకర్ పేర్కొన్నారు.

మహిళా సభ్యులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. జరిగిన పరిణామాల పట్ల చింతిస్తున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

Tags: