CM Revanth Reddy: రాష్ట్రంలోని భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధికారులను ప్రశ్నించారు.

‘‘గతంలో ఎప్పుడూ ఈ సమస్య లేదు కదా.. 22ఏ వివాదంగా మారడానికి అసలు కారణాలు ఏంటి?’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అడిగినట్లు సమాచారం. దీనికి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్‌ వివరాలు వివరించారు. 22ఏ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయని పేర్కొంటూ, నిషేధిత భూముల జాబితాను అప్‌డేట్‌ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గతేడాది చివర్లో జిల్లా కలెక్టర్లు సంతకాలు చేసిన ప్రతులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారని తెలిపారు. ఎక్కడెక్కడ సమస్యలు ఉత్పన్నమయ్యాయి, ఏ మేరకు పరిష్కరించామనే వివరాలను కూడా సీఎంకు సమర్పించారు. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లోనే సమస్య కనిపించిందని, వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించినట్లు వివరించారు.

ముఖ్యమంత్రి ఈ అంశంపై స్పందిస్తూ భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రిని ఆదేశించారు. సమావేశానికి పలువురు కలెక్టర్లు హాజరయ్యారు.

నిషేధిత భూముల జాబితా అంశం శాసనసభ సమావేశాల్లో చర్చకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ భూముల సమగ్ర వివరాలను ప్రజలకు వెల్లడించేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిద్ధమయ్యారు. హైకోర్టు ఆదేశాలతో 2025 చివర్లో జాబితాలను రిజిస్ట్రేషన్ల శాఖ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ క్రమంలో కొన్ని ప్రైవేటు ఆస్తులు కూడా ఆ జాబితాలో ఉన్నాయంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పాత జాబితాలో ఏ వివరాలు ఉన్నాయి, కొత్తగా అప్‌లోడ్‌ చేసిన జాబితాలో ఉన్న వివరాలు ఏంటనేది సభలో మంత్రి వివరించనున్నట్లు తెలిసింది.

ఆదివారం ఈ అంశాలపై మంత్రి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష చేశారు. 22ఏ జాబితాను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాత ఆ జాబితాలో ఉన్నాయంటూ పలుచోట్ల భూములను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్లు తిరస్కరించారు. ప్రధానంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఇలాంటి సమస్యలు వెలుగు చూశాయి. బాధితుల నుంచి 980 దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిష్కారానికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల కార్యదర్శులతో ప్రభుత్వం హైలెవల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. శాసనసభలో విపక్షాల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ సన్నద్ధమైంది. జిల్లాల వారీగా పూర్తి సమాచారాన్ని తెప్పించింది.

ఇదే సమీక్షలో పట్టాల పంపిణీ అంశంపైనా చర్చ జరిగింది. రాష్ట్రంలో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములకు హక్కులు లేని రైతులకు ఇటీవల పట్టాలు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌లో 1,061 మంది రైతులకు 1,044 ఎకరాలు, మహబూబాబాద్‌ జిల్లా నారాయణపురంలో 780 మంది రైతులకు 1,378 ఎకరాలకు పట్టాలు అందజేశారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లోనూ పంపిణీ చేపట్టాల్సి ఉండటంపై సమీక్షించారు. ఇతర జిల్లాల్లో కూడా ఏళ్ల తరబడి హక్కులు రాని భూముల వివరాలను సిద్ధం చేసి సర్వే చేపట్టాలని రెవెన్యూ శాఖను మంత్రి ఆదేశించినట్లు సమాచారం.

Tags: